- ఇప్పటికే రెన్యూవల్ చేసుకున్నోళ్ల ఖాతాల్లో నగదు వేయండి: భట్టి
- రెన్యూవల్‌కు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి
- బ్యాంకర్ల మీటింగ్‌లో డిప్యూటీ సీఎం
- రూ.2 లక్షల ఏకకాల రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలోనే మొదటిసారి: తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రైతులకు రుణమాఫీ అమలయ్యేందుకు బ్యాంకర్లు అన్ని విధాలా సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రుణమాఫీ పూర్తి కాగానే రైతులకు కొత్త లోన్లు ఇవ్వాలని, ఇప్పటికే లోన్రెన్యూవల్ చేసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్ ల)కు సంబంధించి డీసీసీబీలకు విడుదల చేసే మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
వచ్చే నెల రోజుల పాటు రద్దీని తట్టుకునేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని , లోన్ల రెన్యూవల్ నగదు చెల్లింపుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రుణమాఫీ సమయంలో బ్రాంచీల వద్ద తొక్కిసలాట జరగకుండా గ్రామాల వారీగా తేదీలు ప్రకటించి, రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. గురువారం ప్రజా భవన్ లో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వం విడుదల చేసే రుణమాఫీ నిధులను క్రాప్‌లోన్ అకౌంట్లు క్లోజ్చేసేందుకే వినియోగించాలని, ఇతర లోన్అకౌంట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లించవద్దన్నారు.
‘‘వచ్చే నెలాఖరులోగా రూ. 31వేల కోట్లను రుణమాఫీ కింద విడుదల చేస్తాం. ఈ నెలలోనే రెండో దఫా రుణమాఫీ ఉంటుంది. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బ్యాలెన్స్అమౌంట్ను ముందుగా కట్టించుకోవాలి. దేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర. కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్ లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి రికవరీ కాలేదు” అని పేర్కొన్నారు.
గర్వించదగిన రోజు: తుమ్మల
ఒకేసారి రూ.31 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం దేశచరిత్రలో గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ కింద రూ.70 వేల కోట్లు మాఫీ చేశారని, ప్రస్తుతం ఒక్క తెలంగాణలోనే రూ.31 వేల కోట్లు మాఫీ చేయడమంటే మామూలు విషయం కాదన్నారు. ‘‘నాకు తెలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడం బ్యాంకింగ్ చరిత్రలోనే మొదటిసారి. మేము ఈ పథకాన్ని ప్రకటించి ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లు నమ్మలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం పలు విడతల్లో పదేండ్ల పాటు మాఫీ చేయడమే ఇందుకు కారణం’’ అని అన్నారు.