తెలంగాణలో ఫ్యూయల్​ సెల్ ప్లాంట్​ పెట్టండి : తోషిబా ప్రతినిధులను కోరిన భట్టి విక్రమార్క

తెలంగాణలో ఫ్యూయల్​ సెల్ ప్లాంట్​ పెట్టండి : తోషిబా ప్రతినిధులను కోరిన భట్టి విక్రమార్క
  • జపాన్​లోని సంస్థ ప్రతినిధులతో భేటీ
  • ఒసాకా వరకు బుల్లెట్​ ట్రైనల్​లో ప్రయాణించిన డిప్యూటీ సీఎం
  • ఇలాంటి రవాణ వ్యవస్థను రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఫొటో వోల్టాయిక్​/ఫ్యూయల్​ సెల్​ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని జపాన్​కు చెందిన తోషిబా సంస్థ ప్రతినిధులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో సోలార్​ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని, ఫ్యూచర్​ సిటీలోనూ ఫ్యూల్​ సెల్​ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలోనే తమకు వాటి అవసరం ఆవశ్యకమని వివరించారు. బుధవారం ఆయన టోక్యోలోని తోషిబా ఎనర్జీ సిస్టమ్స్​అండ్​ సొల్యూషన్స్​ ప్రతినిధులు హిరోషి కనేట, షిగే రిజో కవహర తదితరులతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల గురించి వివరించారు. ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేసే తోషిబా ప్రస్తుతం.. పర్యావరణహితమైన సోలార్​ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉందని చెప్పారు. ఫొటో వోల్టాయిక్ మాడ్యూల్స్, ఫ్యూయల్​సెల్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​ టెక్నాలజీ, శక్తిమంతమైన జనరేటర్లు, జీరో కార్బన్ ఎమిషన్ టెక్నాలజీలను వృద్ధి చేసినట్టు భట్టికి వివరించారు.

దీంతో విద్యుదుత్పత్తిలో కీలకమైన ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు, నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు, సంబంధిత సేవలు  తెలంగాణలో అవసరమని, కాబట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సంస్థ ప్రతినిధులను భట్టి కోరారు. తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్​గా మార్చడాని కృషి చేస్తున్నామని, ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్​ బస్సుల వాడకాన్ని పెంచుతున్నామన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాలలోకి ప్రవేశించనున్నదని, లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందుకు పోవొచ్చని సూచించారు.

జపాన్​ బుల్లెట్​ ట్రైన్​  ప్రపంచానికే ఆదర్శం


ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని భట్టి విక్రమార్క కొనియాడారు. టోక్యో నుంచి ఒసాకా వరకు భట్టి విక్రమార్క బుల్లెట్​ ట్రైన్​లో ప్రయాణించారు. 700 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 20 నిమిషాల్లోనే చేరుకున్నట్టు తెలిపారు. ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రైన్ లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని చెప్పారు.

ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలోనూ అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖను కోరుతామని చెప్పారు. కాగా, ఒసాకాలో ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని, పరిశ్రమల్ని సందర్శించనున్నారు. భట్టి విక్రమా ర్కతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్​ రోస్​, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇండియన్​ ఎంబసీ అధికారులు ఉన్నారు.