HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

HCU విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

హైదరాబాద్: కంచ గచ్చబౌలిలోని 400 ఎకరాల భూములను చదును చేసిన సందర్భంలో.. హెచ్సీయూలో అలజడి సృష్టించిన విద్యార్థులపై కేసులను ఉపసంహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం ఆదేశించారు. మార్చి 30న (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు వర్సిటీ ఈస్ట్ క్యాంపస్ వద్ద భూమి చదును పనులు జరుగుతుండగా బయటి వ్యక్తులు వచ్చి పోలీసులతో పాటు పని చేస్తున్న వారిపై దాడులకు దిగారు. ఈ దాడిలో మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ గాయపడ్డారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు 53 మందిని అదుపులోకి తీసుకుని పర్సనల్ బాండ్ మీద వదిలేశారు.

టీజీఐఐసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోహిత్, నవీన్ కుమార్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీళ్లిద్దరికి క్యాంపస్తో ఎలాంటి సంబంధం లేకపోయినా అక్కడికొచ్చి అల్లర్లు సృష్టించారని పోలీసులు తెలిపారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని, విద్యార్థులను హాస్టల్స్ నుంచి బయటకు లాక్కెళ్లారని తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులు బయటి వ్యక్తుల ట్రాప్లో పడొద్దని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.