- నది వెంట ఉండే ప్రజలు బాగుపడటం బీఆర్ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు
- కాలుష్య రహిత సిటీగాహైదరాబాద్ను తీర్చిదిద్దుతం
- తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు : మూసీ పూర్వవైభవానికి ఎంత ఖర్చుకైనా వెనకాడమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత సిటీగా తీర్చిదిద్దుతమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎన్టీఆర్మార్గ్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ‘హైదరాబాద్ రైజింగ్’ ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మూసీ పూర్వవైభవానికి కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని సోషల్ మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
నది పరివాహక ప్రజలు అభివృద్ధి చెందకూడదని బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను మభ్యపెట్టడం కోసం కిషన్‌రెడ్డి మూసీ నది వెంట ఒక రోజు నిద్రపోవడం సరికాదని, గుడిసె వేసుకొని కుటుంబంతో జీవించి చూపాలని సవాల్‌విసిరారు. మూసీని జీవనదిగా మార్చాలని ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని, నది వెంట ప్రజల జీవితాలు బాగుపడటం ఇష్టంలేని ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.
ఆ ప్రాంతంలోని పేదలకు మంచి జీవితం అందించేందుకు ఇండ్లకు పట్టాలు ఉన్నా.. లేకున్నా అందమైన టవర్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య లేకుండా వాహనదారులు సజావుగా వెళ్లేలా అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్ల నిర్మాణం చేసి రోడ్లు అభివృద్ధి చేశామని తెలిపారు.