- అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
- హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో అవకాశాలు ఉన్నాయని వెల్లడి
- మైన్ ఎక్స్‌పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సిటీ హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరావాలని అమెరికన్ కంపెనీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికా పర్యటలో భాగంగా లాస్ వెగాస్‌లో జరుగుతున్న మైన్ ఎక్స్‌పో 2024 ఇంటర్నేషనల్ సమిట్‌లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో భట్టి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ, రెనెవబుల్ ఎనర్జీ, వివిధ రకాల ప్రాడక్ట్స్ ప్రొడక్షన్‌లో పురోగమిస్తున్న తెలంగాణ అభివృద్ధిలో అమెరికన్ కంపెనీలు సహకరించాలని కోరారు. ఇండియా ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, తెలంగాణలో ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్‌లో వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.
ఫలితంగా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్, బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ ఉన్న హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానుందని తెలిపారు.
ఫార్మా గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్..
టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా హైదరాబాద్ ఉంటుందని భట్టి అన్నారు. ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’గా హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి గడిచిందన్నారు. ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు.
ఈ విభాగాల్లో ఆసక్తి, అనుభవం ఉన్న వరల్డ్ వైడ్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందన్నారు. ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీకి, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కు దోహదం చేసే సొల్యూషన్స్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని వివరించారు. ఈ సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మైనెక్స్ 2024లో ఆస్ట్రేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు, ఓవర్ బర్డెన్, కోల్ రవాణా బెల్టులను, వాటి పనితీరును పరిశీలించారు. సౌతాఫ్రికా, స్విట్జర్లాండ్, గ్యాటెమాల తదితర దేశాల్లో మేర్ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు భట్టికి వివరించారు.