- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- పలువురు కాంగ్రెస్లో చేరిక
ఎర్రుపాలెం, వెలుగు : మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఆదివారం ఎర్రుపాలెం మండల పరిధిలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, 31గ్రామ పంచాయతీల నుంచి బీఆర్ఎస్ మండల, గ్రామస్థాయి నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎర్రుపాలెం మండలం శకునవీడులో భట్టి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో నాయకులు చావ రామకృష్ణ, చావ అరుణ, పంబి సాంబశివరావు, రామకోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, మలుపురి శ్రీనివాస్, మువ్వ స్వప్న తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాగార్జునసాగర్ చివరి ప్రాంతం లో థర్డ్ జోన్ లో ఉన్న ఎర్రుపాలెం వ్యవసాయ భూములను రెండో జోన్ కు తీసుకువచ్చామని, త్వరలో ఆ పనులకు టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ఎర్రుపాలెం, మధిర మండలంలోని కొన్ని గ్రామాలు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న పలు గ్రామాలకు సాగర్ జలాలు అందించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మధిరలో పాల విప్లవం తీసుకురావడానికి ఇందిరమ్మ డెయిరీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.