- రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిని చేస్తాం
- ఏపీకి నీళ్లిచ్చి జిల్లాను ఎడారిగా మార్చిన కేసీఆర్
- ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కారు షెడ్డుకు కాదు స్క్రాప్‌కు వెళ్లింది :కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మేళ్లచెరువు, వెలుగు: కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బీఆర్‌ఎస్ ఎంత విష ప్రచారం చేసినా.. ఒక్కొక్కటిగా అమలు చేసి చూపిస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని, ఈ నెల 27న చేవెళ్లలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఉచిత కరెంట్, రూ. 500లకే సిలిండర్ పథకాలు కూడా ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. శనివారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో చింతలపాలెం మండలంలోని నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రైతులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడునెలల్లో గత ప్రభుత్వ పాపాలు, దోచుకున్న డబ్బుల లెక్కలు చూడటమే సరిపోయిందన్నారు. నిర్భంద పాలన నుంచి ప్రజాపాలన వైపు ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మహిళను మహాలక్ష్మి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన జీతాలు ఇవ్వడంతో పాటు ఇక నుంచి ప్రతి నెలా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
ఏడు దశాబ్దాలైనా సాగర్ చెక్కుచెదరలే
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఓ పెద్ద మనిషి హుజూర్‌నగర్‌కు వచ్చి సాగర్ డ్యాం ఎక్కడ కట్టేది ఉండెనో చెప్పారు గానీ, మేడిగడ్డ ఎలా కట్టాలో మాత్రం చేసి చూపలేక పోయారని కేసీఆర్ ఉద్దేశించి కామెంట్ చేశారు. సాగర్ డ్యాం ఏడు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదని, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లలోనే కుంగిందని ఎద్దేవా చేశారు.కేసీఆర్ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులరేటరీ, సంగమేశ్వరం నుంచి ప్రతి రోజూ 10 టీసీఎంల నీళ్లు ఏపీకి ఇచ్చి నల్గొండ జిల్లా ను ఎడారిగా మార్చారని మండిపడ్డారు.
జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను విస్తరిస్తామని, రూ. 37 కోట్లతో నక్కగూడెంలో ప్రారంభించిన లిఫ్ట్ ద్వారా,3200 ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. కోదాడ మండలంలోని రెడ్లకుంట,చింతలపాలెం మండలం దొండపాడు గ్రామాలకు కొత్త లిఫ్టును ఏర్పాటు చేయడంతో పాటు అమరవరం లిఫ్టును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కారు పోయింది షెడ్డుకేనని కేటీఆర్ అంటున్నారని, కానీ, అది షెడ్డుకు కాదని, స్క్రాప్‌కే పోయిందని విమర్శించారు. రైతులకు నీరందించే కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మంత్రులు దొండపాడు శివారులో రూ. 400 కోట్లతో నిర్మిస్తున్న ప్రైవేటు కెమికల్ ఇండస్ట్రీకి శంకుస్థాపన చేశారు.