బఫర్ జోన్​లోని ఇండ్ల జోలికి పోవట్లే : భట్టి విక్రమార్క

బఫర్ జోన్​లోని ఇండ్ల జోలికి పోవట్లే : భట్టి విక్రమార్క
  • మూసీ బాధితులకు మరోచోట  మెరుగైన ఇండ్లు ఇస్తం : డిప్యూటీ సీఎం భట్టి
  • ప్రతిపక్షాలు పబ్లిక్​ను తప్పుదోవ పట్టిస్తున్నయ్​
  • రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చెరువులు కబ్జా
  • ఇలాగే కొనసాగితే హైదరాబాద్​ ప్రజలకు పెను ప్రమాదం 
  • నగరాన్ని భవిష్యత్​ తరాలకు అందించాలనేదే మా తపన
  • తమకు ప్రజా ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా లేదని వెల్లడి
  • ఓఆర్​ఆర్​లోపు ఆక్రమణకు గురైన చెరువులపై పవర్​పాయింట్ ​ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు : హైడ్రా పరిధిలోని బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లను తాము కూల్చడం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్​ పరిధి లోపల పెద్ద ఎత్తున చెరువులు కబ్జాలకు గుర్యయాయని, కొన్ని చెరువులను పూర్తిగా మాయం చేశారని  తెలిపారు. ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ తపన అని, ఇప్పుడున్న చెరువులనైనా కాపాడుకోవాలని, ఎఫ్​టీఎల్​లో ఉన్న నిర్మాణాలను తొలగించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. మూసీ ప్రక్షాళన విషయంలో ఎవరికి వ్యక్తిగత ఎజెండాలు లేవని స్పష్టం చేశారు. 

సోమవారం సెక్రటేరియెట్​లో 2014 నుంచి 2023 మధ్య కాలంలో హైదరాబాద్‌‌, చుట్టు పక్క ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌‌పాయింట్‌‌ ప్రజెంటేషన్‌‌ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘చెరువులో కట్టిన ఇల్లు కూల్చాలనే తపన లేదు. చెరువులను కాపాడుకోవాలనేదే మా తపన. చెరువుల పరిరక్షణ అనేది అందరి కోసం చేసిన ఆలోచన. చాలా బాధాతప్త హృదయంతో చెబుతున్నా. మూసీ కూడా చాలా కబ్జాకు గురైంది. అక్కడ ఎవరూ నివసించలేని పరిస్థితి. ప్రపంచంలో నది పరీవాహక ప్రాంతంలోనే అనేక నగరాలున్నాయి.

లండన్ నగరంలో థేన్స్ నది నగరం మధ్యలో నుంచి వెళ్తుంది. జపాన్ లో ఒసాకా నది ఉంది. ఆ నగరానికి మణిహారంగా మార్చారు. టోక్యోలో సుమిధ నది ఉంది” అని వివరించారు. ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారిని ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని, ఎవర్ని నష్టపరిచే పని ఈ ప్రభుత్వం చేయదు.. చేయబోదని చెప్పారు. మనది గ్లోబల్ సిటీనే అని, ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. మూసీ బాధితులందరితో మాట్లాడటానికి  ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. తలుపులు తెరిచే ఉన్నాయని, ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పొచ్చని అన్నారు. ‘‘మీలాగా మేం గడిలో లేం. 

మీకు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం ఇష్టం లేకపోతే చెప్పండి. గాంధీనగర్​లో సబర్మతి నది సుందరీకరణ చేయలేదా? ఇక్కడ మూసీ ప్రక్షాళనపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నరు? ఇల్లు కట్టుకోవడం ఎంత విలువైందో మాకు తెలుసు. నిర్వాసితులకు అంతకంటే మెరుగైన ఇండ్లు కట్టి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నం. స్థానికంగా ఉన్న  ప్రభుత్వ స్థలాలను చూసి అక్కడే ఇండ్లు కట్టే ఆలోచన చేస్తున్నం” అని ప్రతిపక్షాలనుద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. 

ఎవరు ఏ సూచనలు, సలహాలు ఇచ్చినా..  ప్రజలకు మెరుగైనవి అనుకుంటే స్వీకరిస్తామని తెలిపారు.  ఎలాంటి సూచనలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే బాధ్యత లేని ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుందని విమర్శించారు. తాము ముమ్మాటికీ చెరువులను రక్షిస్తామని స్పష్టం చేశారు.  

ఆ చెరువులను పూర్తిగా కబ్జా చేశారు..

పవర్​పాయింట్​ ప్రజెంటేషన్ ​సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్​మెట్​లో కుంట్లూరు దగ్గర ఉన్న చెరువును భట్టి ప్రస్తావించారు. 1.62 ఎకరాల్లో ఉన్న ఈ చెరువును పూర్తిగా మాయం చేశారని, అక్కడ ఇప్పుడన్నీ నిర్మాణలే ఉన్నాయని శాటిలైట్​ ఇమేజ్​ చూపిస్తూ వివరించారు. రాజేంద్రనగర్​ బుద్వేల్​లో నూ 6.39 ఎకరాల చెరువు తుడిచిపెట్టుకుపోయిందని, గండిపేటలో పుప్పాలగూడ దగ్గర 9.25 ఎకరాల్లో ఉన్న చెరువును మాయం చేశారని వెల్లడించారు. బాలపూర్​లోని మర్రివానికుంట లో 1.98 ఎకరాల్లో లేఅవుట్​ వేశారన్నారు.  

గండిపేటలో పితురుకుంట చెరువుల్లో రెసిడెన్షియల్​ కాంప్లెక్సులు వచ్చాయని తెలిపారు.  ఉప్పల్​ మండలంలోని మల్లాపూర్​ దగ్గర 1.92 ఎకరాలు ఉంటే ఇప్పుడు కమర్షియల్​ బిల్డింగ్స్​ వెలిశాయని చెప్పారు. మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలో దుండిగల్​ గండిమైసమ్మ మండలంలోని బహదూర్​పల్లిలో 5.49 ఎకరాల్లో ఉన్న చెరువును పూర్తిగా ఆక్రమించుకుని, బాస్కెట్, ఫుట్​బాల్​ స్టేడియం ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. 

అందరికీ న్యాయం చేస్తం

మూసీ ప్రక్షాళనలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న వా రందరికీ న్యాయం చేస్తామని భట్టి హామీ ఇచ్చారు.మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలిగిం చబోమని, ఇండ్లను తొలగించిన బాధితులకు వేరేచో ట ఇండ్లు ఇస్తున్నామని, కూలగొట్టిన ఇండ్ల కంటే మెరుగైన ఇండ్లను ఇస్తున్నామని తెలిపారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్లిక్ ను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.  

హైదరాబాద్ అంటేనే.. రాక్స్, లేక్స్, పార్క్స్ అని తెలిపారు. సురక్షితమైన హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలని, నగరానికి మూసీ నదిని మణిహారంగా మార్చాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. అసలు టెండర్లే పిల వకుండా మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపక్షాలు ఎలా చెబుతారని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. 

చెరువుల సర్వేకు సర్కారు ఆదేశం

హెచ్ఎండీఏ  పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం ప్రకటించారు.  గ్రేటర్ హైదరాబాద్​లోని చెరువుల విస్తీర్ణం.. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల ను గుర్తించాలని నిర్ణయించామని,  3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

ఏడేండ్లకు సరిపడా కరెంట్ సప్లయ్​కి ప్లాన్ చేయండి

రాష్ట్రంలో రాబోయే ఏడేండ్లకు సరిపడా కరెంట్​ సరఫరాకు ప్లాన్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ట్రాన్స్​కోను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సోమవారం సెక్రటేరియెట్​లో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం 15,700 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నదని, రాబోయే ఏడేండ్లకు డిమాండ్ 27వేల మెగావాట్లకు పెరగొచ్చని.. అందుకు అనుగుణంగా కరెంటు సరఫరాకు కావాల్సిన ప్రణాళికలను రూపొందిం చుకుని, కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు.

ట్రాన్స్ కో ఆధ్వర్యంలో చేపడుతున్న సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల గురించీ భట్టి ఆరా తీశారు. వచ్చే రెండేండ్లలో సంస్థపరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. డైరెక్టర్ నుంచి ఏఈ వరకు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అప్​డేట్ చేసుకొని సంస్థలను బలోపేతం చేయాలన్నారు.

లేటెస్ట్​ టెక్నాలజీకి రీసెర్చ్ సెంటర్ పెట్టండి

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవడానికి ట్రాన్స్​ కోలో రీసెర్చ్ సెంటర్ ఏర్పా టు చేయాలని ఎనర్జీ సెక్రటరీ రొనాల్డ్ రోస్​ను భట్టి విక్రమార్క ఆదేశించారు. సంస్థలో పనిచేస్తున్న ఇంజినీర్లకు అధునాతన టెక్నాలజీపై అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు.