బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్ఎస్, బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • 10 నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి
  • వారి పాపాలు బయటపడ్తయనే కుల గణనను ఆ రెండు పార్టీల నేతలు​ వ్యతిరేకిస్తున్నరు​
  • బీఆర్ఎస్​ నేతలు గుంజుకున్న అసైన్డ్​ భూములను తిరిగి పేదలకు పంచుతమని వెల్లడి
  • గాంధీ భవన్​లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం​ 

హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్​ క్యాడర్​కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం పది నెలల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గర్వంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం గాంధీ భవన్​లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

దీనికి చీఫ్ గెస్ట్​గా హాజరైన భట్టి మాట్లాడుతూ... రాహుల్​గాంధీ ఆలోచనమేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి, 80 వేల మంది ఎన్యుమరేటర్లతో రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వేను విజయవంతంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.  కుల గణన సర్వే పూర్తి కావడం కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించాలని అన్నారు. ఈ సర్వే దేశానికి రోల్ మోడల్ కాబోతున్నదని తెలిపారు.  కుల గణన సర్వే జరిగితే తమ పాపాలు, లోపాలు బయటపడతాయన్న భయంతోనే సర్వే గురించి బీఆర్ఎస్, బీజేపీ పాలకులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

కుట్రతోనే కలెక్టర్​పై దాడి

లగచర్లలో రైతులకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్​మాట్లాడటంపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరగొద్దని కుట్రపూరితంగా కలెక్టర్ స్థాయి అధికారిపై దాడి చేయించారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా రైతుల నుంచి ప్రజా ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోదని భట్టి స్పష్టం చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలకులు అసైన్ చేసి పేదలకు పంచిన భూములను గత బీఆర్ఎస్ పాలకులు బలవంతంగా గుంజుకున్నారని,  వాటిని తిరిగి రైతులకు అప్పగిస్తామని చెప్పారు.

10 నెలల కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ. 500 కే సిలిండర్ లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.  రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 10 లక్షలకు పెంచి ప్రతి పేదవాడికి గుండె ధైర్యం కల్పించామని చెప్పారు.  ఈ ఏడాది 4 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి, ఇస్తామన్నారు.  ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.  హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీలు 40% పెంచామని వివరించారు.

గత బీఆర్ఎస్ పాలకులు రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని తెలిపారు. హైదరాబాద్,  సికింద్రాబాద్, సైబరాబాద్ సిటీలకు ధీటుగా ప్రజా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా అన్ని హంగులు, అన్ని వసతులు ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని తెలిపారు.

హైదరాబాద్ నగరంమీదుగా 55 కిలోమీటర్ల మేర వెళ్తున్న మూసీకి పునరుజ్జీవం తీసుకురావడానికి ప్రణాళికలు తయారు చేసి, ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అన్నారు. అమాయకులైన పేద ప్రజలను రెచ్చగొట్టి మూసీ పునరుజ్జీవం కాకుండా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ప్రతి ఏటా వడ్డీ లేకుండా 20 వేల కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు.

రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా  పవర్ ప్లాంట్ ప్రాజెక్టుల్లో మహిళలను భాగస్వాములను చేసినట్టు చెప్పారు.  టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రూప్–1తో పాటు ఇతర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినట్టు తెలిపారు. కేవలం 10 నెలల్లోనే రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిదేనని అన్నారు.

దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులకు  ఒకేసారి రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు.  సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, పోచారం శ్రీనివాస్​ రెడ్డి, నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులు, కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. 

చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పండి: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

ఏడాది కాలంలో ప్రజా ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించిందని పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్​, రూ. 500 కే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 50 వేల ఉద్యోగాల భర్తీలాంటివన్నీ ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు.  ప్రజా పాలన  ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలను  నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు  ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికీ తీసుకెళ్లాలని కోరారు.  పార్టీ కోసం పని చేసిన అందరికీ పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నేతలు గట్టిగా కృషి చేయాలని కోరారు. 

ఏడాది పాలనపై పెద్ద ఎత్తున సంబురాలు 

ప్రజా పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని మండలాల్లో పెద్ద ఎత్తున సంబురాలు చేయా లని పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చిం చారు. నియోజకవర్గానికి ఒక కో ఆర్డినేటర్ ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జరుగుతున్న కులగణన పై కూడా చర్చించారు. దీన్ని కూడా జనంలోకి బలంగా తీసుకెళ్లాలని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఆయా వర్గాలకు  ప్రభుత్వం ఏం చేయనుందో వివరించాలని సూచించా రు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్ గౌడ్ నియామకమైన రెండు నెలల్లో చేసిన కార్యక్ర మాలపై కూడా ఇందులో చర్చించారు. ప్రభు త్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 7 లోపే మిగిలిన నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయంపై చర్చించారు.