మేం గడీల్లో పడుకోలే.. ప్రజల మధ్యే ఉన్నాం : భట్టి విక్రమార్క

మేం గడీల్లో పడుకోలే.. ప్రజల మధ్యే ఉన్నాం : భట్టి విక్రమార్క
  • ప్రతిపక్షాలవి పనికిమాలిన విమర్శలు
  • ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే ప్రాణ నష్టం తగ్గింది 
  • జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కోవడానికి హైడ్రాను సిద్ధం చేశాం
  • వరద బాధితులకు తక్షణ సాయం అందిస్తున్నామని వెల్లడి  

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో వరదల రూపంలో విపత్తు ఎదురైనప్పుడు గత బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని.. ప్రజల మధ్యన ఉండి సహాయక చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అనుకోని విధంగా వచ్చిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం హై అలర్ట్ గా ఉన్నందునే రాష్ట్రంలో ఎక్కడ పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ప్రజల మధ్యన ఉండి ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ప్రజలకు సహాయక చర్యలు చేపట్టడం వల్లనే భారీ విపత్తును అధిగమించాం. మా ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయి’’ అని ఆయన ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ పాలనలో చేసిన పాపాలపై ప్రజలు నిలదీస్తారన్న భయంతోనే ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్​రావు సోషల్ మీడియాలో రాజకీయం చేస్తూ బతికేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో భట్టి మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న పనికిమాలిన విమర్శలను ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

బాధితులకు పూర్తి అండగా ఉంటాం 

భారీ వర్షాలు కురవడం వల్ల, వరదలతో నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యావసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలకు భోజన వసతితో పాటు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. వరదలు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖమ్మంలో మున్నేరు ఉప్పొంగడంతో కొంతమేర అధిక నష్టం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 

Also Read :- ఖమ్మం ప్రజల కష్టలు చెప్తే తీరనివి

హైడ్రా, విద్యుత్ సిబ్బంది శ్రమ కన్పించట్లేదా?
 
గత బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షం పడితే జంట నగరాలు మునిగాయని, కానీ ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు వచ్చినా హైదరాబాద్ సురక్షితంగా ఉన్నదంటే ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితమే అని భట్టి అన్నారు. చెరువుల ఆక్రమణలు తొలగిస్తూ వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. ప్రస్తుతం ఈ విపత్తును ఎదుర్కోవడానికి రెస్క్యూ ఆపరేషన్ టీంలను కూడా రంగంలోకి దింపిందన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడడానికి ఆ శాఖ సిబ్బంది అర్ధరాత్రులు పిడుగులు పడుతున్నా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైనే ఉండి యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేస్తూ సేవలు అందించిన విషయం ప్రతిపక్షాలకు కనబడకపోవడం విడ్డూరమన్నారు. విద్యుత్ సిబ్బంది సామాజిక ధర్మాన్ని పాటిస్తూ ఎంత కష్టమైనా విధులు నిర్వహిస్తున్నారని భట్టి అభినందించారు.