గత సర్కారుది గడీల పాలన మాది ప్రజా పాలన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గత సర్కారుది గడీల పాలన మాది ప్రజా పాలన : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • అదానీ, అంబానీలను కాదని మహిళా సంఘాలతో  10 మెగావాట్ల సోలార్ ఉత్పత్తికి ఒప్పందం
  • ఎస్​హెచ్​జీల నుంచే ఆర్టీసీ బస్సులు లీజుకు తీస్కుంటం
  • హరీశ్​ ఇంట్లోని మహిళలు బస్సెక్కితే 
  • తమ హామీల అమలు సంగతి తెలుస్తుదని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్​ సర్కారుది గడీల పాలన అయితే.. తమది ప్రజా పాలన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి రాగానే అదానీ, అంబానీలను కాదని  స్వయం సహాయక సంఘాల సభ్యులతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. గురువారం గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి విక్రమార్క ప్రజలు, కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి వాటిని మహిళా సంఘాల (ఎస్​హెచ్​జీ)కు అప్పగిస్తామని,  వారు ఆర్టీసీకి బస్సులను లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చూస్తామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని,  అందుకే ప్రజా సమస్యల పరిష్కారానికి గాంధీభవన్​ లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.  తమ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని చెప్పారు. ఏ ఒక్క హామీని అమలు చేస్తలేరని బీఆర్ఎస్ నేత హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలపై భట్టి ఫైర్ అయ్యారు. హరీశ్​రావు ఇంట్లోని మహిళలు బస్సు ఎక్కితే.. తమ సర్కారు హామీలను నెరవేరుస్తున్నదో లేదో తెలుస్తుందని అన్నారు. విద్య, వైద్యంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని డిప్యూటీ సీఎం చెప్పారు. 

మంత్రులతో ముఖాముఖికి వినతుల వెల్లువ 

మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రామ్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు  పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. సుమారు 300 మంది వివిధ సమస్యలపై డిప్యూటీ సీఎంను కలిశారు. పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించినా ఇంకా పోస్టింగ్​ ఇవ్వలేదంటూ జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులు డిప్యూటీ సీఎంను కలిశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.  ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు,  పెన్షన్లు, నామినేటెడ్ పదవుల కోసం పెద్ద మొత్తంలో అర్జీలు వచ్చాయి.

కాగా, పార్టీలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి కాట శ్రీనివాస్ గౌడ్  అనుచరులు ఇందిరా భవన్​ ఎదుట ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొని కాట శ్రీనివాస్ గౌడ్ ను అవమానపరుస్తున్నారని  అన్నారు. చివరకు డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వారి వద్దకు వచ్చి  సముదాయించారు. ఇప్పటి నుంచి శ్రీనివాస్ గౌడ్ కు పార్టీలో తగిన గౌరవం ఇచ్చే బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు.