కొందరు ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకున్నారు: భట్టి

కొందరు ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకున్నారు: భట్టి

ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని.. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో ప్రజల్లో మత సామరస్యం పెరుగుతుందని అన్నారు. కొందరు ప్రభుత్వాన్ని అవమానించటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యార్థులకు భోదన అందిస్తామని.. సకల సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తామని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాదికి రూ.5వేల కోట్లు కేటాయించామని అన్నారు భట్టి విక్రమార్క. మొదటి దశలో 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకి శంఖుస్థాపన చేస్తున్నామని అన్నారు.

గత ప్రభుత్వం కులం ,మతం పేరు మీద గురుకులాలు ఏర్పాటు చేశారని.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా అందరూ కలిసి ఒక్క దగ్గర చదువుకుంటారని అన్నారు. రాష్ట్ర ,దేశ నిర్మాణానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 25 వేల పాఠశాలలో రూ. 1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని అన్నారు.