బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అధికారంపైనే ప్రేమ : భట్టి విక్రమార్క

  • ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్న తెలంగాణ తల్లి విగ్రహం 
  • అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి అభిప్రాయం చెప్పకుండా బయట ఉండడాన్ని చూస్తే.. వారికి అధికారం పైనే ప్రేమ, తాపత్రయం ఉందన్న అభిప్రాయం కలుగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. సభలో సీఎం ప్రకటన తర్వాత దానిపై సహజంగా చర్చే ఉండదు.. కానీ, అందుకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరలేపుతూ ప్రకటనపై సభ్యులందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటం చూస్తే వారికి తెలంగాణపై, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రేమ లేదని సభ్యులంతా భావిస్తున్నారని తెలిపారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై భట్టి విక్రమార్క మాట్లాడారు. “సోనియా గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి చొరవతోనే తెలంగాణ ఏర్పడింది. అందులో ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. మరోసారి వారికి నా ధన్యవాదాలు అసెంబ్లీ రికార్డుల్లో అధికారికంగా తెలియజేస్తున్నాను” అని ఇదే సభలో 2014 డిసెంబర్13న అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని భట్టి గుర్తుచేశారు.

తెలంగాణ ఏర్పాటుకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంటే.. డిసెంబర్ 9న యూపీఏ చైర్ పర్సన్ గా సోనియాగాంధీ తన జన్మదినం సందర్భంగా హోంమంత్రి చిదంబరంతో అధికారికంగా ప్రకటన చేయించారని తెలిపారు. ‘‘సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను రాష్ట్రం మొత్తం పండుగలా జరుపుకుంటుంటే.. ఈ పండుగ మాకు అవసరం లేదని బీఆర్ఎస్ నేతలు బయటికి పోవడంతో ఏ సం దేశం ఇస్తున్నారు’’అని ప్రశ్నించారు.

ప్రభుత్వం, ప్రతిపక్షం అభిప్రాయాలు చెబితేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని భట్టి అన్నారు. పెద్దల సభ శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై తాను ప్రకటన చేస్తే సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు.