9న కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి

 9న కొత్త ఎనర్జీ పాలసీ ప్రకటిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి
  • దేశ, విదేశీ పెట్టుబడులు వస్తయ్
  • 2030 నాటికి 22వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
  • గత పదేండ్లు ఎనర్జీ పాలసీని బీఆర్​ఎస్​ పట్టించుకోలేదని ఫైర్​
  • జెన్​కో ఏఈలకు అపాయింట్​మెంట్ లెటర్లు

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క ఎనర్జీ పాలసీ తీసుకురాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. కానీ.. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కొత్త ఎనర్జీ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. గురువారం తమ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని వెల్లడించారు. జెన్​కోలో ఉద్యోగం పొందిన 315 మంది ఏఈలకు సెక్రటేరియెట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద అపాయింట్​మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు.

‘‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఎనర్జీ పాలసీని తీసుకొచ్చాం. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్​లో కొత్త పాలసీని ఆమోదించాం. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తికి కావాల్సిన అన్ని అంశాలపై స్టడీ చేసి పాలసీ రూపొందించినం. 2030 నాటికి రాష్ట్రానికి కావాల్సిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నం. దీనికి తగ్గట్టుగా ట్రాన్స్​మిషన్ వ్యవస్థను విస్తరిస్తున్నం. 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ జనరేట్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నం. రామగుండంలో జెన్​కో, సింగరేణి జాయింట్ వెంచర్​గా థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నం’’అని భట్టి విక్రమార్క తెలిపారు. 

నైనీ బ్లాక్​ను సింగరేణికి అప్పగించినం

పదేండ్లుగా పెండింగ్​లో ఉన్న నైనీ బ్లాక్ కోసం ఒడిశా వెళ్లి అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపామని, దాన్ని సింగరేణికి అప్పగించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కోల్ బ్లాక్ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు వివరించారు. ‘‘కరెంట్ కోతలపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు విశ్వసించలేదు. ఇటీవల ఖమ్మంలో వరదలు పోటెత్తినా కరెంట్ అంతరాయం లేకుండా సరఫరా చేసినం. వర్షం కురుస్తున్నా.. వరదలో అర్ధరాత్రి కరెంట్ స్తంభాలు ఎక్కి పని చేసిన విద్యుత్ సిబ్బందిని అభినందిస్తున్న.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నం. నిరుద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినంఇప్పటి వరకు 56వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినం”అని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తనియా, ట్రాన్స్​కో సీఎండీ కృష్ణ భాస్కర్,సింగరేణి సీఎండీ బలరాం, జెన్కో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.