కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి
  • అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఖమ్మంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో డిమాండ్

ఖమ్మం టౌన్, వెలుగు: రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రద్దు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అంబేద్కర్​ను ఉద్దేశిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం టౌన్​లో మంగళవారం నిర్వహించిన నిరసన ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి భట్టి పాల్గొన్నారు. డీసీసీ ఆఫీస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం దాకా కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘‘అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇండియా నిలిచింది.

 రాజ్యాంగం.. కొద్ది మంది దళితులు, బలహీన వర్గాలకు సంబంధించింది కాదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రజలందరికీ రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. అంబేద్కర్​ను కించపర్చిన అమిత్ షా.. తన పదవికి రాజీనామా చేయాల్సిందే. రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నది. రాహుల్ గాంధీ ఐదేండ్లుగా ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టినం’’అని భట్టి తెలిపారు.

ప్రధాని మోదీకి ఇండియాపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. ఇండియా మొత్తం తలదించుకునేలా అమిత్ షా వ్యవహరించారని మండిపడ్డారు. అనంతరం అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు..