గృహజ్యోతికి కొత్తగా దరఖాస్తు చేసుకునే చాన్స్ : భట్టి విక్రమార్క

గృహజ్యోతికి కొత్తగా దరఖాస్తు చేసుకునే చాన్స్ : భట్టి విక్రమార్క
  • అవకాశం కల్పించాల్సిందిగా అధికారులకు భట్టి ఆదేశం
  • పవర్​ జనరేషన్​కు అన్ని జాగ్రత్తలు తీసుకోండి
  • జెన్​కోలో  టెక్నికల్ సమస్యలపై త్రిసభ్య కమిటీ వేయండి
  • విద్యుత్ సంస్థల అధికారులతో సమీక్షా సమావేశం

హైదరాబాద్​, వెలుగు: గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి అప్లై చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.  జెన్ కో నిర్వహించే జనరేటింగ్​స్టేషన్లలో ఏర్పడే టెక్నికల్​ సమస్యలను పరిష్కరించడానికి త్రిసభ్య కమిటీ వేయాలని సూచించారు. ఈ క‌‌మిటీ  క్షేత్రస్థాయిలో అధ్యయ‌‌నం చేసి, పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలన్నారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా జెన్​ కో సీఎండీ నిర్ణయం తీసుకుని విద్యుదుత్పత్తికి అంతరాయం రాకుండా చూడాలని ఆదేశించారు. 

బుధవారం ప్రజా భవన్ లో ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స‌‌మీక్ష నిర్వహించారు. విద్యుదుత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు  తీసుకోవాలని ఆదేశించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్–1లో కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్​ రిపేర్​ చేసే అవకాశం ఉందా? లేదా కొత్తది కోనుగోలు చేయాలా? అనే అంశాన్ని టెక్నికల్ కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. 

2023 డిసెంబర్​కు ముందు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలుకుసంబంధించి తప్పనిసరిగాఈ ప్రభుత్వానికి నివేదించాలని అధికారుల‌‌ను ఆదేశించారు. నిర్ణయాలను అమలు చేసే సమయంలో సీఎండీలు తప్పనిసరిగా ఎనర్జీ సెక్రటరీని సంప్రదించాలని సూచించారు.‌‌ జల విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక స‌‌మ‌‌స్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇలాంటి విషయాల్లో  ఆలసత్వం వహించవద్దని హెచ్చరించారు. 

సదరన్​ డిస్కంలో కొత్తగా 227 సబ్​ స్టేషన్లు 

ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో 227 సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రక్రియ మొదలైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాళేశ్వరం, ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని మెగావాట్ల కరెంట్​ ఉప‌‌యోగిస్తున్నారు?  దీనికి ఎంత మేర ఖ‌‌ర్చు అవుతోంది? అనే నివేదిక ఇవ్వాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు