చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువ.. బీఆర్ఎస్‎పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువ.. బీఆర్ఎస్‎పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

పెద్దపల్లి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియమకాల కోసమమని.. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ఆ ఆకాంక్షను విస్మరించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 4) పెద్దపల్లిలో యువ వికాసం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజల ప్రేమే ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటిదన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. ఒక్క సంవత్సరంలోనే 56 వేల గవర్నమెంట్ జాబ్స్ భర్తీ చేయడమంటే ఆశామాషీ కాదన్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టామని.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు రూ.కోటి ఇన్సూరెన్స్ చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసింది తక్కువ.. ప్రచారం చేసుకుంది ఎక్కువ అని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా మేం అధికారంలోకి వచ్చింది పని చేయడానికన్నారు. మా ప్రభుత్వం రోజూ 18 గంటలు పని చేస్తోందని తెలిపారు. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ఐదేండ్లు రైతులను ఏడిపించిందని.. కానీ మేం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే  రికార్డ్ స్థాయిలో పంట లోన్ మాఫీ చేశామని చెప్పారు. మా ప్రభుత్వం లాగా దేశంలో రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేసిన రాష్ట్రం మరేదైనా ఉందా అని ప్రశ్నించారు.