బ్రిటిష్ వాళ్లకే భయపడలే.. ఆఫ్ట్రాల్ మీరేంత..? బీజేపీపై భట్టి ఫైర్

బ్రిటిష్ వాళ్లకే భయపడలే.. ఆఫ్ట్రాల్ మీరేంత..? బీజేపీపై భట్టి ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని.. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతోందని డిప్యూటీ సీఎం విక్రమార్క అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ పై పెట్టిన కేసులకు భయపడి ధర్నా చేయడం లేదని.. ప్రజాస్వామయ్యం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు.

దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ నేషనల్ హెరాల్డ్ పత్రిక పెట్టారు. ఆ నేషనల్ హెరాల్డ్‎ పేపర్‎ను చూసి బీజేపీ భయపడుతోందన్నారు. ఇందిరా, రాజీవ్ దేశం కోసం త్యాగం చేశారు. గాంధీ ఫ్యామిలీ అనాడు బ్రిటిష్ వాళ్లకే భయపడలేదు.. అలాంటిది మోడీ ఎంత అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనియా, రాహుల్ కేసులకు భయపడే వ్యక్తులు కాదన్నారు. బీజేపీ తన కీలుబొమ్మ ఈడీతో కాంగ్రెస్‎ను భయపెట్టాలనుకుంటే అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. తెలంగాణ మాదిరిగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

►ALSO READ | SC ST అధికారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

రాహుల్ డిమాండ్‎కు ప్రధాని మోడీ భయపడ్డారు. అందుకే కులగణన టాపిక్ డైవర్ట్ చేసేందుకు రాహుల్, సోనియాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సంక్షేమ పాలన చేస్తున్నామని.. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణన మేం చేసి చూపించామన్నారు. బలహీన వర్గాల లెక్కలు ఎంతో తీసి.. వారి ఫలాలు వారికే దక్కాలే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తోందన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈడీ పేరుతో ప్రతిపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఫైర్ అయ్యారు. మోడీ, అమిత్ షాల సొంత  రాష్ట్రం గుజరాత్‎లో బీజేపీని ఓడించేందుకు వస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.