
హైదరాబాద్: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఖర్చు చేయని నిధులు ఎన్ని..? బడ్జెట్లో పెట్టి ఖర్చు చేయని ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేండ్లలో బడ్జెట్లో పెట్టినప్పటికీ రూ.70 వేల కోట్లు ఖర్చు చేయలేదు.. ఆ నిధులు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం (మార్చి 27) ద్రవ్య వినిమయ బిల్లుకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చాలా ఆశలతో తెచ్చుకున్న రాష్ట్రం ఇది. లక్ష్యాలకు అనుగుణంగా మన ఖర్చులు ఉండాలి. ఈ సభలో ప్రజల కోసమే చర్చ జరగాలని మా ఆకాంక్ష’’ అని అన్నారు.
Also Read : హరీశ్ రావుపై స్పీకర్కు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా మేం అడ్డగోలుగా బడ్జెట్ అంచనాలు పెంచలేదని.. వాస్తవానికి దగ్గరగా ఉండాలని వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. మేం ఎంత ఖర్చు చేస్తామో.. అంతే బడ్జెట్ పెట్టామని చెప్పారు. రూ.1,658 కోట్లు గృహజ్యోతి పథకం కింద చెల్లిస్తున్నాం. రూ.3,223 కోట్లు ఆర్టీసీ మహాలక్ష్మి స్కీమ్‌కు ఇస్తున్నాం. రూ.14,375 కోట్లు పవర్ సెక్టార్‌కు అందిస్తున్నామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.5లక్షల కంటే తక్కువ బిల్లులు మేం అధికారంలోకి వచ్చాక క్లియర్ చేశామని చెప్పారు.
ఇవే కాకుండా బీఆర్ఎస్ పెట్టిన ఇతర పెండింగ్ బకాయిలను మేం చెల్లిస్తున్నామని తెలిపారు. మేం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేరుగా లబ్ధిదారులకు వెళ్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో భట్టి మాట్లాడుతుండగా కేటీఆర్, హరీష్ రావు రన్నింగ్ కామెంట్రీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన భట్టి.. ‘‘నేను మీలా యాక్సిడెంటల్‌గా రాజకీయాల్లోకి రాలేదు. చట్టసభలను రాజకీయ స్వార్థాల కోసం ఏనాడు వాడలేదు. అధికారం అనేది ఓ బాధ్యతగా తీసుకున్నాం. వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తున్నాం. మేం దోపిడీ చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు’’ అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వెనకబడిన వారికి వాళ్ల వాటా వాళ్లకు దక్కాలని ఆలోచించామని.. అత్యంత సున్నితమైన ఎస్సీ వర్గీకరణ, కుల గుణనను కూడా మేం పరిష్కారించామని తెలిపారు. దీంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. కమిట్మెంట్ ఉంది కాబట్టే కులగణన సర్వే సమర్ధవంతంగా పూర్తి చేశామన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక చేసేందుకు ప్రారంభించిన రాజీవ్ యువ వికాసానికి రూ.600 కోట్లు కేటాయించామని.. ఈ పథకంలో ఈడబ్ల్యూఎస్ వాళ్లను కూడా అర్హులుగా చేర్చామని.. దీంతో మరో కూ.3 వందల కోట్లు కలిపి మొత్తం రూ.9 వందల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.