మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి గుడ్ న్యూస్.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు

వరంగల్: మహిళలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు. మహిళలను లక్ష్యాధికారులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం-ప్రజా పాలన -ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా మంగళవారం (నవంబర్ 19) వరంగల్‎లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు. ఈ సభకు హాజరై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల  సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని దుయ్యబట్టిన భట్టి.. రాష్ట్రంలో మేం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలతో మహిళా సాధికారతకు కృషి చేశామని గుర్తు చేశారు. మహిళల కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని.. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 

మహిళల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ విషయం చెప్పేందుకే ఇక్కడ సభ పెట్టామని తెలిపారు. వరంగల్ పట్టణాభివృద్ధి కోసం దాదాపు రూ.6 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని.. వరంగల్‎ను మహా నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్నీ వాగ్దానాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ప్రభుత్వం నేరవేరస్తోందన్నారు.