- అందరికీ ఇసుక అందుబాటులో ఉంచండి
హైదరాబాద్, వెలుగు: అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలో సబ్ యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇసుక విషయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై శుక్రవారం సెక్రటేరియేట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి నెల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదాయం పెంపుపై జరిగే సమావేశానికి కొత్త ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని రావాలని సూచించారు.
ఎల్ఆర్ఎస్ పథకంలో వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు.. ఇప్పటివరకు సమకూరిన ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ ద్వారా ఏ మేరకు ఆదాయం అంచనా వేయవచ్చు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరుల్లో జీఎస్టీ ఒకటని.. ఈ అంశంలో లీకేజీలను అరికట్టిందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలపై చర్చించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కానివ్వొద్దని ఆదేశించారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయంగా ఆదాయం పెంపు పైన అధికారులు దృష్టి సారించాలని భట్టి దిశానిర్దేశం చేశారు.