మధిరలో ఇందిరా డెయిరీ ప్రాజెక్టుకు శ్రీకారం : భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : మధిరలో ఇందిరా డెయిరీ  ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీకారం చుట్టారు. ఈ విషయమై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో డీఆర్డీవో విద్యా చందన, డీపీఎంలు శ్రీనివాస్, దర్గయ్య, ఐదు మండలాల ఏపీఎంలు, సీసీలు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు పాడి గేదెలు  ఇప్పించి వారి నుంచి ఇందిరా డెయిరీ ద్వారా పాల సేకరణ చేస్తామన్నారు.  

పశువులకు కావాల్సిన గడ్డి, దాణాను మహిళా రైతుల ఇండ్ల కు చేర్చేందుకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రతి మండలంలో వెటర్నరీ అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు  చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు  పర్యవేక్షణకు డీఆర్డీఓ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తామని తెలిపారు. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా మధిరలో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.

మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన ప్రాజెక్టును త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. మహిళలకు వివిధ రంగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని డీఆర్డీవో అధికారులను ఆదేశించారు. మహిళలకు కుట్టు మిషన్ల శిక్షణకు 2013లో సెంటర్​కు 20 చొప్పున  ఇప్పించిన మిషన్లు ఏం చేశారని అధికారులను ప్రశ్నించారు. మిషన్లు తుప్పు పడుతున్న క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 2021లో పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.