లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుందన్నారు.
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎంపిక చేస్తారని చెప్పారు. ప్రజా పాలనలో ప్రజలందరి సమక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను తయారు చేస్తారని చెప్పారు.
Also Read :చెన్నూరును క్లీన్ టౌన్‌గా మారుస్త
ఎర్రుపాలెం మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎర్రుపాలెం మండలంలో ఉన్న చెరువులు అడవులను రక్షించుకుంటూ ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధితో స్థానిక ప్రజల ఆదాయ వనరులు, జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రజా ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతుందన్నారు. ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అర్బన్ పార్క్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టామని చెప్పారు.