- సెంటర్ లో నేచురోపతి, పంచకర్మ, రిలాక్సింగ్ థెరపీ అందుబాటులోకి..
షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతి వనంలో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషదాయకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘వెల్ నెస్ బై హార్ట్ ఫుల్ నెస్’ అనే థీమ్‌తో ఈ సెంటర్‌ను నెలకొల్పడం గొప్ప ప్రయత్నమని కొనియాడారు. కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన వెల్ నెస్ సెంటర్ ను భట్టి విక్రమార్క గురువారం ప్రారంభించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా శ్రీ రామ చంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ, ఆచార్య డాక్టర్ శ్రీవర్మ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ ప్రియాంక హాజరయ్యారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం జ్యోతి వెలిగించి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘వెల్ నెస్ బై హార్ట్ ఫుల్ నెస్’ సెంటర్ లో అన్ని చికిత్సా విధానాలను ఒకే చోట ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఆయుష్ నుంచి పోలారిటీ హీలింగ్ వరకూ సంప్రదాయ, ఆధునిక విజ్ఞానం కలగలిపి చికిత్సా విధానాలను అందుబాటులోకి తేవడం అభినందించదగ్గ విషయమన్నారు.
కాగా, ‘వెల్ నెస్ బై హార్ట్ ఫుల్ నెస్’ సెంటర్ లో నేచురోపతి, నేచర్ క్యూర్, పంచకర్మ, బాడీ డీటాక్స్, రిలాక్సింగ్ థెరపీ, రెటీనా ద్వారా హెల్త్ కండిషన్ తెలుసుకోవడం వంటివన్నీ కలిపి హెల్త్ ప్యాకేజీలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆక్యుప్రెజర్, ఆక్యుపంక్చర్, ఆయుర్వేద, డైట్ థెరపీ, ఫిజియోథెరపీ, క్వాంటం హీలింగ్ వంటి చికిత్సలు కూడా అనుభవజ్ఞులైన డాక్టర్లు, థెరపిస్టుల బృందం ఆధ్వర్యంలో అందిస్తామని పేర్కొన్నారు.