బషీర్ బాగ్, వెలుగు: స్వాతంత్ర్యోద్యమంలో ముస్లింల త్యాగాలు, పోరాటాలు మరువలేనివని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్, క్విట్ ఇండియా , డూ ఆర్ డై నినాదాలు ఇచ్చింది ముస్లిం నాయకులేనని చెప్పారు. ‘స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింల పాత్ర’ అనే అంశంపై సయ్యద్ షా నవాజ్ అహ్మద్ ఖాద్రి రచించిన ‘బ్లడ్ స్పీక్ టూ’ పుస్తకాన్ని గురువారం రవీంద్ర భారతిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో భాగస్వామ్యం లేనివారు భారత రాజకీయ ముఖచిత్రాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు.
స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన ముస్లింల చరిత్రను మరుగున పడేలా కొందరు కుట్ర చేస్తున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ముస్లింలు పాల్గొన్నారని, కుల, మత, వర్గాలకు అతీతంగా పోరాడితేనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. రచయిత సయ్యద్ షా నవాజ్ అహ్మద్ ఖాద్రి తన పుస్తకంతో చరిత్రను వెలికి తీశారన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేశారన్నారు
. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని, బీజేపీ చర్యలు ప్రజాస్వామానికి తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్నారని, అన్ని వర్గాల మద్దతు అందించాలని కోరారు. దేశంలోనే మొదటిసారి తెలంగాణలో కులగణన చేపట్టినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ బిన్ అహ్మద్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఎ.ఫైన్, తెలంగాణ మైనార్టీ చైర్మన్ ఒబెదుల్ల కోతవాల్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తారిక్ అన్సారి, అమీర్ ఇఫ్తాకర్ తదితరులు పాల్గొన్నారు.