ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తం : భట్టి విక్రమార్క

ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తం : భట్టి విక్రమార్క
  • ప్రతినెలా ఐదారు వందల కోట్లు విడుదల చేస్తం: భట్టి 
  • మొత్తం 8 వేల కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని వెల్లడి 
  • డిప్యూటీ సీఎంతో ఉద్యోగుల జేఏసీ నేతల భేటీ 

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో భట్టిని ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు తదితర పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వచ్చే నెల నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెల రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని చూస్తున్నాం” అని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి రూ.5 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో పెట్టి వెళ్లిందని, గత 14 నెలల కాలంలో మరికొన్ని బకాయిలు జమయ్యాయని పేర్కొన్నారు.

 తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత, కొత్త బకాయిలు కలిపి రూ.10 వేల కోట్లు ఇప్పటికే చెల్లించినట్టు వివరించారు. ‘‘ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్) సిబ్బంది ఉన్నారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వీటిని చెల్లించడంతో పాటు ఇతర సమస్యలు కూడా పరిష్కరిస్తాం” అని తెలిపారు. 

వీఆర్ఏల జీతాలివ్వండి: ట్రెసా  

రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన సప్లిమెంటరీ జీతం బిల్లులు, వాహన అద్దె చార్జీలు, మెడికల్ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, సరెండర్ లీవ్, ఎన్నికల గౌరవ వేతనం రిలీజ్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టిని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి కోరారు. గత మూడు నెలలుగా వీఆర్ఏల జీతాలు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన భట్టి.. క్రమం తప్పకుండా బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.