- ఐదెకరాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు: డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం 5 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ పార్కు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. దీనివల్ల యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థిక చేయూత లభిస్తుందన్నారు. సోమవారం సెక్రటేరియెట్ లో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినేట్సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం భట్టితోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలన్నారు. కొన్ని ప్లాట్లు వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం సమకూరేలా ముందుకు వెళ్లాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. రాజీవ్ స్వగృహలోని పెండింగ్ ప్లాట్ల స్థితిగతులను సబ్ సమీక్షించారు. జాయింట్ వెంచర్స్ లో విలువైన ఆస్తులు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారని.. ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలన్నారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ వారంలోగా సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, హౌసింగ్ సెక్రటరీ బుద్ధ ప్రకాశ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.