
- నిధుల కొరత లేదు.. పనులు పూర్తయ్యే కొద్దీ కేటాయింపులు
- కబ్జా అవుతున్న ఆర్ అండ్ బీ ఆస్తుల రక్షణకు చర్యలు
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఆర్ అండ్ బీ శాఖ పత్రిపాదనలపై గురువారం సెక్రటేరియెట్‌లో ప్రీ బడ్జెట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ డీపీఆర్, 3డీ డిజైన్లు వంటి పనులు స్పీడప్ చేయాలని.. నిధుల కొరత లేదని తెలిపారు.
ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని.. పెద్ద సంఖ్యలో ఉన్న విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైబ్రిడ్ యాన్యుటీ హెడ్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రోడ్లు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్ ీ సబ్ ప్లాన్ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకువచ్చామని.. గత పదేండ్లు పాలించినోళ్లు ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. తిరిగి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పూర్తిస్థాయిలో అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల అద్దె భవనాల బకాయిలు చెల్లిస్తం
గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని.. ప్రతిపాదనలు తీసుకురావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సెక్రటేరియెట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో రిపేర్లు చేపట్టాలి, కిటికీలు, ప్రధాన ద్వారాలకు దోమతెరలు ఏర్పాటు చేయాలని అందుకు అవసరమైన నిధులు వెంటనే కేటాయిస్తామని భట్టి.. మంత్రి పొన్నంకు తెలిపారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి ఆదేశిం చారు.
టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు. డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపై దృష్టి సారించాలని ఆదేశించారు. గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ కోర్స్‌తో పాటు ఒక ఒకేషనల్ కోర్సును కేటాయించాలని.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యార్థులు పూర్తిగా అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెడితే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు.. నిర్వహణ, ఆదాయ వనరులపై చర్చించారు.