- ఉత్పత్తి పనులు వేగంగా చేపట్టాలి.. ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
- నిర్వాసితులకు మెరుగైన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
- గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే పనుల్లో ఆలస్యం
- 2015లో సింగరేణికి బ్లాక్ దక్కినా ఇప్పటికీ పనులు స్టార్ట్ కాలే
- అనుమతులన్నీ రావడంతో ఉత్పత్తి చేపట్టాలని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ పనులు వేగంగా పూర్తి చేయాలని, మరో నాలుగు నెలల్లో అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ‘‘సింగరేణి చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రం వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కావడంతో రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలి.
నైనీ ప్రాంతంలోని స్థానిక ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనులు చేయాలి” అని స్పష్టం చేశారు. నైనీ బొగ్గు బ్లాక్‌పై మంగళవారం సెక్రటేరియెట్‌లో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నైనీ బ్లాక్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి తరఫున తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
స్పెషల్ ఆఫీసర్‌గా నైనీ జనరల్ మేనేజర్
నైనీ బొగ్గు బ్లాక్ కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ‘‘ఒడిశా అటవీశాఖతో సంప్రదింపులు జరపాలి. సింగరేణికి బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్లు లెక్కించి, వాటిని తొలగించే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలి. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్‌గా నైనీ జనరల్ మేనేజర్ కు బాధ్యతలు అప్పగించాలి” అని అధికారులకు ఆయన సూచించారు.
నిర్వాసిత గ్రామ ప్రజలతో తాను, స్థానిక ఛెండిపడ ఎమ్మెల్యే అగస్తి బెహరా, స్థానిక ప్రజాప్రతినిధులు చర్చించిన విధంగా పునరావాస పథకం రూపొందించాలని స్పష్టం చేశారు. సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగంగా స్థానిక గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై ప్రణాళికలు తయారు చేసి, అమలు చేయాలని ఆయన ఆదేశించారు. నైనీ కోసం రోడ్డు విస్తరణ, విద్యుత్ లైన్ల పనులపై ఒడిశా ఆర్అండ్బీ, విద్యుత్ శాఖలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పునరావాస, నష్టపరిహారం ప్యాకేజీపై చర్చించే ఆర్పీడీఏసీ మీటింగ్‌ను పూర్తి చేసుకోవాలన్నారు.
గత సర్కారు నిర్లక్ష్యంతోనే లేట్
2015 లో సింగరేణికి నైనీ బొగ్గు బ్లాక్ ను కేటాయించినా గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతో ఇప్పటికీ అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక చొరవ తీసుకుని తాను స్వయంగా ఒడిశా వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించానని తెలిపారు. సానుకూల పరిణామాల నేపథ్యంలో టైంబౌండ్ ప్లానింగ్‌తో పనులు పూర్తి చేయాలని, రోజువారీగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. నైనీ బొగ్గు బ్లాకుపై ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యలకు పరిష్కారం చూపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పనికి నిర్దేశిత కాలపరిమితిని విధించుకొని పూర్తి చేస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఆయన వివరించారు.