ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చును ప్రతి నెలా చెప్పాల్సిందే : డిప్యూటీ సీఎం భట్టి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చును ప్రతి నెలా చెప్పాల్సిందే : డిప్యూటీ సీఎం భట్టి
  • .ఫండ్స్​ మొత్తం వినియోగించాలి
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్ , వెలుగు: ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని అధికారులను  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై శుక్రవారం సెక్రటేరియెట్​లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన రివ్యూ చేపట్టారు. సబ్ ప్లాన్​లో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించాలన్నారు. ‘‘సబ్ ప్లాన్ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలి. ఈ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం బాగా పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలి.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న సమావేశానికి రావాలి” అని అధికారులను ఆదేశించారు. సబ్ ప్లాన్ చట్టం కోటా ప్రకారం ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి ప్రణాళికలు  సిద్ధం చేసుకున్నారని ఆయా శాఖ అధికారులను ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ ఫండ్స్ మాత్రమే కాకుండా బడ్జెటేతర నిధులు ఖర్చు చేసే సమయంలోనూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అనే దానిపై  సంపూర్ణ సమాచారం అందించాలని ఆదేశించారు. సబ్ ప్లాన్​కు సంబంధించి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో  అధ్యయనం చేసిన సెస్ నివేదికను మీటింగ్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు  అధికారులు వివరించారు.  

ఎస్సీ, ఎస్టీలకు చేయూతనందించాలి

అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం.. ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాటితోపాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇందుకు ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతోపాటు ఆదివాసి, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి  సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ , ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి, పంచాయతీ రాజ్ ఈఎన్సీ కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.
 
పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు..

మూసీ పునరుజ్జీవం కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించాలని, వారిని స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్చి, వడ్డీ లేని రుణాలు అందించి, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని అధికారులను  ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని.. మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు ఆయా వర్గాలకు అందించాలని ఆయన సూచించారు. ఇందిర జలప్రభ, మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు.