వర్షాకాలమొస్తున్నది..అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండండి

వర్షాకాలమొస్తున్నది..అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండండి
  • విద్యుత్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు : వర్షాకాలం ప్రారంభం కాబోతున్నందున విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో శనివారం ఆయన సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో రివ్యూ చేశారు. ఈదురు గాలులతో చెట్లు విరిగిపడటం, స్తంభాలు కూలిపోవడం, కరెంట్‌‌‌‌‌‌‌‌ తీగలు తెగిపడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని, దీని వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిబ్బంది అలర్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలని సూచించారు.

ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన కరెంట్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉందని, సరఫరాలోనూ ఎలాంటి అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లైన్స్ క్లియరెన్స్ (ఎల్‌‌‌‌‌‌‌‌పీ) విషయంలోనూ జాగ్రత్త వహించాలన్నారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో ఎల్‌‌‌‌‌‌‌‌సీ ఇవ్వడానికి వీల్లేదని, ఒక ప్రాంతం తర్వాత మరో ప్రాంతంలో ఎల్సీ ఇవ్వాలని సూచించారు. ఎల్‌‌‌‌‌‌‌‌సీ తీసుకునే ముందు స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు.

ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి మొదలు లైన్‌‌‌‌‌‌‌‌మెన్ వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం సమీక్షలు చేసుకుంటూ సమాచారం పంచుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ, సదరన్​ పవర్​ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ సీఎండీ ముషారఫ్​ అలీ, ట్రాన్స్​కో జెండీ శ్రీనివాస్​ రావు పాల్గొన్నారు. మరోవైపు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు.