
- ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
- రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంచిర్యాల, వెలుగు: గత కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీళ్లు పారిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ సర్కారు ప్రాణహితను పాతరేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి కట్టుబడి ఉందన్నారు. ఎమ్మెల్యే కె.ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన అంబేద్కర్జయంతి వేడుకలు, బహిరంగ సభలో భట్టి చీఫ్‌గెస్ట్‌గా పాల్గొన్నారు.
ముందుగా ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆవిష్కరించారు. ఐబీలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు. అక్కడి నుంచి జడ్పీ బాయ్స్ హైస్కూల్‌వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ రూ.765 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో భట్టి మాట్లాడారు.
ముంపు ప్రాంతంలో ఎంసీహెచ్‌ను నిర్మించవద్దని ఆనాడే చెప్పామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రూ.300 కోట్లతో ఐబీలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు ఎంసీహెచ్‌ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం రూ.256 కోట్లతో రాళ్లవాగుకు కరకట్టలు కట్టి మంచిర్యాలలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. తాజాగా రూ.765 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాల నియోజకవర్గంపై ఎంతో ప్రేమ ఉందని, తన సొంత నియోజకవర్గమైన మధిరతో సమానంగా చూస్తానన్నారు. ఏడాదిన్నర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు.
మంచిర్యాలలో త్వరలోనే ఇండస్ట్రియల్హబ్
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ గురించి చులకనగా మాట్లాడడం బాధాకరమన్నారు. బాపూజీ, అంబేద్కర్ఆలోచనా విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. మంచిర్యాలలో త్వరలోనే ఇండస్ట్రియల్ హబ్ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 15 వేల ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్చేయాలని కోరారు. పది రోజుల్లో ఇండస్ట్రియల్ హబ్‌కు ఫండ్స్ రిలీజ్ అవుతాయని తెలిపారు. ఖానాపూర్ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ చైర్పర్సన్ కె.సురేఖ తదితరులు పాల్గొన్నారు.