
- కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, గాంధేయవాదాన్ని ముందుకు తీసుకెళ్లారు: భట్టి విక్రమార్క
- స్పీకర్‌గా అసెంబ్లీని చాలా హుందాగా నడిపేవారు
- శ్రీపాదరావు 88వ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారు మాజీ స్పీకర్ శ్రీపాదరావును ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జీవితం ఒక పాఠం లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, గాంధేయ వాదాన్ని ముందుకు తీసుకెళ్లిన నేత అని పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగారని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఒకసారి గెలిస్తే.. మరోసారి గెలవడం కష్టం అయిన రోజుల్లో.. ఎనిమిది సార్లు ఆ కుటుంబాన్ని మంథని నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారని, ఇది ఆ కుటుంబంపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం అవుతుందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలను శ్రీపాదరావు చాలా కంట్రోల్‌గా నడిపేవారని, సభలో గంభీరంగా ఉండేవారని గుర్తుచేశారు. ఆదివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకల్లో భట్టి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా శ్రీధర్ బాబు పనిచేస్తూ అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా సభను హుందాగా నడిపిస్తున్నారని కొనియాడారు.
అజాత శత్రువు శ్రీపాదరావు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
శ్రీపాదరావు అజాత శత్రువు అని, నేటి రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీపాదరావు మరణించి 25 ఏండ్లు గడిచినా ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోయారంటే.. ఆయన మంచితనం, ప్రజలకు చేసిన సేవలేనన్నారు. అసెంబ్లీని ఆయన నిర్వహించిన తీరు తమకు ఆదర్శమని పేర్కొన్నారు.
అందరికీ మార్గదర్శి: మంత్రి పొన్నం
రాజకీయాల్లో చిరస్మరణీయుడు శ్రీపాదరావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే వాళ్లు ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. కాకా వెంకటస్వామి, చొక్కరావు, శ్రీపాదరావు సమకాలీన రాజకీయాల్లో ఇప్పటికీ ఆదర్శవంతంగా ఉన్నారని పేర్కొన్నారు.
శ్రీపాదరావు ఆశయాలను కుమారుడు శ్రీధర్ బాబు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాజకీయాల్లో ప్రజలతో మమేకమైతే ఎలా ఉంటామో శ్రీపాదరావును చూస్తే అర్థం అవుతుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కుమారుడు శ్రీధర్ బాబును కోరారు. శ్రీపాదరావు జీవితం ఆదర్శనీయమని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
రాజకీయాల్లో విలువలు పాటిస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని శ్రీపాదరావు కుమారుడు, మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘‘మా నాన్న శ్రీపాదరావు జయంతి సందర్భంగా గత 25 ఏండ్లుగా ప్రముఖులను సత్కరిస్తున్నాం. పలు రంగాలకు చెందిన ప్రముఖులను సన్మానిస్తున్నాం. మా నాన్న చాలా రాజకీయ అంశాలు మాతో చెప్పేవారు.
ప్రజలకు ఎంత వరకు న్యాయం చేయొచ్చో.. మేం అంత వరకు న్యాయం చేస్తున్నాం. మంథని ప్రజల అభిమానంతో నేను ఇన్నిసార్లు గెలిచాను. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిది”అని అన్నారు. కాగా, కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు అవార్డులు అందజేశారు.