
మధిర, వెలుగు: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని పురాతన శివాలయం, మధిరలోని మృత్యుంజయ ఆలయంలో డిప్యూటీ సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుటుంబం పేరిట కూడా ఆలయాల్లో పూజలు చేయించారు.
సొంతూరు స్నానాల లక్ష్మీపురంలో పూజలు చేసిన తర్వాత డిప్యూటీ సీఎం చిన్ననాటి మిత్రులతో కలిసి జాతరలో తిరిగారు. మిఠాయిలు కొనుగోలు చేసి తింటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని అభివృద్ధి పనులను పరిశీలించారు. డిప్యూటీ సీఎం వెంట ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.