హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి చేయించింది బీఆర్ఎస్సేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. దాడులతో రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. కలెక్టర్పై దాడిని బీఆర్ఎస్ ఎందుకు ఖండించలేదని, పదేండ్లుగా సీఎంగా పనిచేసిన కేసీఆర్ దీనిపై మాట్లాడరేంటని భట్టి నిలదీశారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని చెప్పారు.
బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడం లేదని, అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టి దాడి చేయించారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. భూమి కోల్పోతున్న రైతుల బాధ తమకు తెలుసని, భూమి కోల్పోయే వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామని భట్టి చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధితోనే రూరల్ ఏరియా అభివృద్ధి చెందుతుందని వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే భూసేకరణ కీలకమని ఆయన తెలిపారు.
పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమని భట్టి స్పష్టం చేశారు. కొడంగల్ లో పారిశ్రామిక అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నామని, రూరల్ ఏరియాకు అభివృద్ధిని విస్తరింపజేస్తామని ఆయన వివరించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తాము ప్రజల పక్షాన పోరాడామని, తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరహాలో వ్యవహరించలేదని బీఆర్ఎస్ తీరుపై భట్టి మండిపడ్డారు. ఉద్యమంలో కూడా అమాయకులను రెచ్చగొట్టారని, మీ కోసం అమాయక ప్రజలు బలి కావాలా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దాడి ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.