- 23,824 గ్రామాలకు గాను 1,156 గ్రామాలకే నీళ్లిస్తున్నారా?
- ఇంటింటికీ నీళ్లిచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా వట్టిదేనా?
- అధికారులను ప్రశ్నించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: మిషన్‌భగీరథ స్కీమ్ కింద ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ బోగసేనా? అని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ‘‘గ్రామాల్లో పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరుగుతున్నదని, నీటి ఎద్దడి లేదంటూ సర్పంచుల సంతకాలు తీసుకుని గత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దానిపై కేంద్రానికి కూడా నివేదిక పంపింది. కానీ ఇప్పుడేమో రాష్ట్రంలోని 1,156 గ్రామాలకు 50 శాతం మాత్రమే నీటి సరఫరా చేస్తున్నట్టు మీరు చెబుతున్నారు.
అంటే గత ప్రభుత్వం చేసిన ప్రకటన వట్టిదేనా?’’ అని నిలదీశారు. భగీరథ కింద రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం కొన్ని గ్రామాలకే నీళ్లు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. మిషన్‌భగీరథపై బుధవారం సెక్రటేరియెట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి భట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘రాష్ట్రంలో 23,824 గ్రామాలు ఉండగా.. 1,156 గ్రామాల్లో 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నామని అంటున్నారు. ఆలేరు, భువనగిరి, నల్గొండ, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదంటున్నారు.
అందుకు నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్రావడం ఏంటి? మిషన్‌భగీరథపై ప్రస్తుతం జరుగుతున్న సర్వే ఎప్పుడు పూర్తవుతుంది? ఆ సర్వే వివరాలన్నింటినీ ఎమ్మెల్యేలకు అందజేయండి’’ అని అధికారులను ఆదేశించారు. భగీరథ కోసం వేల కోట్ల అప్పు చేశారని, కానీ దాని ప్రయోజనం మాత్రం పూర్తిస్థాయిలో లేదని అన్నారు. కాగా, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్మెట్రోవాటర్ సప్లై నుంచే తాగునీటి సరఫరా జరుగుతున్నదని.. కానీ దాన్ని కూడా భగీరథ రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
కార్మికుల జీతాలు ఎందుకు ఆపుతున్నరు?
ప్రతి గ్రామానికి సమీపంలోని నీటి వనరుల నుంచే నీళ్లను సరఫరా చేయాలని అధికారులకు భట్టి సూచించారు. ‘‘వందల కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లను సరఫరా చేస్తుండడం వల్ల తరచూ పైప్లైన్లు పగిలిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి” అని అన్నారు. భగీరథ సిబ్బంది జీతాలను నెలల తరబడి ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించారు. ‘‘ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కార్మికుల వేతనాలు ఉంటున్నాయి. రూ.8 వేల నుంచి రూ.13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. జీతాల కోసం ప్రభుత్వం అందిస్తున్న నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని, భగీరథ కార్మికులకు తక్కువ చెల్లిస్తున్నాయి.
దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. ప్రభుత్వం అందిస్తున్న జీతాలతో కార్మికులకు ప్రయోజనం చేకూరాలి తప్ప.. మధ్యవర్తులకు కాదు. రాష్ట్రంలో ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి? జీతాల కోసం సర్కార్ ఇస్తున్న మొత్తమెంత? కార్మికులకు ఏజెన్సీలు చెల్లిస్తున్న మొత్తమెంత? అనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్రమంతటా భగీరథ కార్మికులందరికీ జీతాలు ఒకే రకంగా ఉండేలా అమౌంట్ ఫిక్స్ చేయండి’’ అని ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.