మీలాగా గాల్లో మేడలు కట్టలే.. మాది నూటికి నూరుపాళ్లు ప్రజా బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టి

మీలాగా గాల్లో మేడలు కట్టలే.. మాది నూటికి నూరుపాళ్లు ప్రజా బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టి
  • బీఆర్ఎస్​లెక్క బడ్జెట్ పెంచితే రూ.4.18 లక్షల కోట్లు అయ్యేది
  • పదేండ్లలో రూ.16.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు?
  • ఒక్క కాళేశ్వరం కడ్తే అదీ మూడేండ్లకే  కొట్టుకపోయింది
  • నాడు రూ.6 వేల కోట్ల ఇసుక ఆమ్దానీకి గండికొట్టారు
  • ఏపీకి నీళ్లు వదిలేసి గోవిందా.. గోవిందా అన్నది మీరు కాదా?
  • బీఆర్​ఎస్​ హయాంలో  నిర్బంధాలు, నిరంకుశత్వమే అని ఫైర్

హైదరాబాద్, వెలుగు: అబద్ధాలకు, అడ్డగోలు అంకెలకు దూరంగా కేవలం​ వాస్తవ అంచనాలపైనే తమ ప్రభుత్వం బడ్జెట్​ను రూపొందించిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇది నూటికి నూరుపాళ్లు ప్రజా బడ్జెట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్​పై బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు చేసిన విమర్శలకు భట్టి కౌంటర్​ ఇచ్చారు. ‘‘గత బడ్జెట్​తో పోలిస్తే మేం 4.5 శాతం అంచనాలను మాత్రమే పెంచాం. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు. ఏటా 20 శాతం బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. పదేండ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం చేశారు. మీలాగా పెంచుతూపోతే ఈసారి రూ. 4.18 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టాల్సి వచ్చేది. కేవలం వాస్తవాల మీద బడ్జెట్ ప్రవేశపెట్టాం.

రాష్ట్ర ఆదాయం, ఖర్చు విషయంలో పారదర్శకంగా ఉన్నాం. మేం వచ్చిన తర్వాత ఆదాయం ఏందో, ఖర్చు ఎంతో ప్రజల ముందు స్పష్టం చేశాం. రూపాయి  రూపాయి పోగేస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. జీఎస్టీ గ్రోత్  దేశం కంటే తక్కువ ఉందని హరీశ్ అంటున్నారని, కానీ బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ వసూళ్లు 8.4  శాతం ఉండగా, ప్రస్తుతం 12.3శాతం ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాల న్నారు. గత పదేండ్ల పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్ట కుండా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో ఇసుక, మైనింగ్​ మాఫియాలను కట్టడి చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘మీలాగా(బీఆర్​ఎస్​) నాలుగు గోడల మధ్య బంధించుకుని మేం లేం. ప్రజల కోసం పనిచేస్తున్నం. ఇసుక మీద రోజుకు మూడు కోట్ల ఆదాయం తెచ్చాం. ఇసుక మాఫియా వల్ల పదేండ్లలో రూ.6 వేల కోట్లు ఖజానాకు రాకుండా పోయింది” అని చెప్పారు. ఇసుక మాఫియా సహా అన్ని మాఫియాలను తాము కట్టడి చేస్తున్నామని, వనరుల దోపిడీ అడ్డుకుంటున్నామని తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో నిర్బంధాలు, నిరంకుశత్వమే ఉందని..అలాంటిది స్వేచ్ఛ గురించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.

‘‘ఏ ఒక్క రోజు కూడా  పదేండ్లలో బీఆర్​ఎస్​ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేదు. మేం పడిన అవమానాలు అసెంబ్లీలో ఎవరూ పడలేదు. అన్నీ సహించుకుంటూ ముందుకు వెళ్లాం. గతంలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఎక్కడైనా నిరసన వ్యక్తం చేద్దామంటే హౌస్​అరెస్ట్​లు చేసేవారు. కానీ, మా ప్రజా ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఎవరికిఇబ్బంది ఉన్నా వచ్చి చెప్పుకునే అవకాశం ఇస్తున్నది. ఇది అందరి ప్రభుత్వం. గతంలో మాదిరి తలుపులు మూసుకుని కూర్చోవడం లేదు” అని ఆయన తెలిపారు.

ఆమోదం లేకుండా 2.30 లక్షల కోట్ల ఖర్చేంది?
గత పదేండ్లు బీఆర్ఎస్ ప్రవేశపెటిన బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా లేదని.. దీంతో రాష్ట్రంలో కొన్ని వర్గాలు నష్టపోయాయని భట్టి తెలిపారు. అందులో భాగంగానే సీఎం, కేబినెట్ కూర్చొని బడ్జెట్​ను ఊహలు, ఆశల పల్లకిలో తీసుకెళ్లేలా ఉండకూడదని నిర్ణయించామని చెప్పారు. వాస్తవానికి దగ్గర ఉండాలని, ప్రజల అవసరాలు తీర్చేదిలా ఉండాలని రూపొందించామని పేర్కొన్నారు. ‘‘గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.16.70 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టింది. ఆ మొత్తం ఏం చేశారు? వాటితో ఏం నిర్మించారు? 16.70 లక్షల కోట్లతో నాగర్జున సాగర్ నిర్మించారా..? ఎస్సారెస్పీ  నిర్మించారా..? ఓఆర్ఆర్ నిర్మించారా..? ఎయిర్​పోర్ట్ నిర్మించారా..? కాళేశ్వరానికి  మాత్రమే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారు. అదీ కూలిపోయింది” అని మండిపడ్డారు.

సింగరేణికి రూ.77 వేల కోట్లు బకాయిలు పెట్టిపోయారని ఫైర్ అయ్యారు. బీఆర్​ఎస్​ పాలనలో అసెంబ్లీ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని స్వయంగా కాగ్ వెల్లడించిందన్నారు. ‘‘ఓఆర్ఆర్​ టోల్​ టెండర్లను రూ.7 వేల కోట్లకే 30 ఏండ్ల కాలానికి అమ్ముకున్నారు. దొడ్డిదారిన ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. వచ్చే ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయాన్ని కూడా ముందు తీసుకున్నారు. ఇదీ వాళ్ల పద్ధతి” అని బీఆర్​ఎస్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ లేకుండా కోటి ఎకరాలకు నీళ్లా?
గతంలో కృష్ణా నీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఏదైనా చేసుకొమ్మని చెప్పి సహకరించారని, ఇప్పుడేమో రాయలసీమకు నీళ్లు పోతున్నాయని.. పంటలు ఎండిపోతున్నాయని మాట్లాడుతున్నారని బీఆర్​ఎస్​ నేతలపై భట్టి ఫైర్​ అయ్యారు. ‘‘శ్రీశైలం నిండకపోతే  ఖమ్మానికి, నల్గొండకు, కల్వకుర్తి లిఫ్ట్​​కు, పాలమూరు– రంగారెడ్డికి సాగు నీళ్లు, హైదరాబాద్​ తాగునీరుకు నీళ్లు అందవు. దీనికి కారణం బీఆర్ఎస్​ ఆనాడు తీసుకున్న నిర్ణయం కాదా? అటు గోదావరి నుంచి కూడా  ప్రాణహిత –చేవెళ్ల నీళ్లు రాకుండా ఖతం చేశారు. ఏమన్నంటే కాళేశ్వరం, కోటి ఎకరాలు అంటూ వాళ్లు మాట్లాడుతరు.

డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​​ కూడా తీయకుండానే కోటి ఎకరాలు ఎట్ల సాగయ్యాయో చెప్తరా?  ఇప్పుడు నీళ్లు పారుతున్నవన్నీ గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు, కెనాల్స్​తోనే. బీఆర్​ఎస్​ కట్టిన  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నేను బడ్జెట్​ స్పీచ్​ ఇస్తున్నప్పుడు వాళ్లు ‘గోవిందా.. గోవిందా’ అని అన్నారు. వాస్తవానికి పదేండ్లలో నీళ్లు ఏపీకి వదిలేసి ‘గోవిందా.. గోవిందా’ చేసింది బీఆర్​ఎస్” అని ఆయన తెలిపారు. బీఆర్​ఎస్​ నేతలు ఇంటికో ఉద్యోగం అన్నారని, ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము చదువులు, ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కాగా, మండలిలోనూ బడ్జెట్​పై భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. 

హరీశ్​.. పరిధి దాటి మాట్లాడొద్దు
బడ్జెట్ పై మాట్లాడకుండా హరీశ్​రావు  పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. సభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా? హుందాగా వ్యవహరించాలని స్పీకర్​ చెప్తున్నా హరీశ్​ మాత్రం పట్టించుకోవడం  లేదు. పైగా వాదనకు దిగడం ఏమిటి? సభా నాయకుడికి అజ్ఞానం అంటున్నాడు.. మాకేమో బుద్ధి మాంద్యం అంటున్నాడు. విద్యావంతుడైన హరీశ్​రావు భాష పట్ల కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. పరిధి దాటి మాట్లాడొద్దు. 
-భట్టి విక్రమార్క

మహిళా సంఘాల గురించి మీరా మాట్లాడేది?
తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్​ను తూచ తప్పకుండా అమలు చేస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ‘‘ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. రాజీవ్​ యువ వికాసం అమలు చేస్తున్నాం. గిరిజనుల కోసం రూ.12,500 కోట్లు గిరి వికాసానికి కేటాయించాం. గత సర్కార్​మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్ను ఏం చేసిందో అందరికీ తెలుసు.

దళితుడిని సీఎం చేస్తా అని ఆ వర్గం నుంచి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఆ వర్గానికి చేసిందేమిటి? ఇచ్చినట్టే ఇచ్చి డిప్యూటీ సీఎం పోస్టును రాత్రికి రాత్రే బర్తరఫ్​ చేశారు. దళిత బంధు బై ఎలక్షన్​ కోసం తెచ్చి వదిలేశారు” అని మండిపడ్డారు. ‘‘మహిళా సంఘాలను పదేండ్లు గాలికి వదిలేసిన మీరా(బీఆర్ఎస్​) ఇప్పుడు మాట్లాడేది? ఐకేపీల గురించి మాట్లాడే హక్కు  కాంగ్రెస్ పార్టీకే ఉంది. ప్రతి మండలంలో ఐకేపీల కోసం గోడౌన్​లు కట్టిస్తాం.

మహిళా సంఘాలు చేసిన వస్తువుల అమ్మకాలకు బజార్ ఏర్పాటు చేశాం. వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో సాగుతున్నాం. సోలార్​ పవర్​లో వెయ్యి మెగావాట్ల ఎంవోయూ చేసి మహిళ సంఘాలకే ఇచ్చాం. ఒక యాక్షన్​ ప్లాన్​ను రెడీ చేసి.. త్వరలోనే సోలార్​ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి పూజ చేస్తాం. ఐకేపీలతో వడ్లు కూడా కొనుగోలు చేయిస్తున్నాం” అని వివరించారు. సీడీపీ ఫండ్స్​ ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

బట్ట కాల్చి మీదేసుడు హరీశ్కు అలవాటైంది
‘‘ఎల్​ఆర్​ఎస్​పై బీఆర్​ఎస్​ నేతలు మాట్లాడుతూ రక్త మాంసాలు గుంజుతున్నారని అంటున్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలోనే ఎల్​ఆర్​ఎస్​ తెచ్చారనే విషయం మరిచిపోవద్దు. లక్షలాది మంది ప్లాట్లు కొనుగోలు చేసుకుని వాటిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాటిని ఎల్ఆర్​ఎస్​తో పారదర్శకంగా రెగ్యులరైజ్​ చేస్తున్నాం” అని భట్టి విక్రమార్క అన్నారు. పైగా 25 శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు. ‘‘ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టారని బీఆర్​ఎస్​ నేతలు అంటున్నారు. ఎక్కడ పెట్టాం. బట్ట కాల్చి మీద వేయడం హరీశ్​రావుకు అలవాటుగా మారింది’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్​ స్కూళ్లను పక్కా భవనాలతో ఒకేసారి 58 స్కూళ్లకు శాంక్షన్​ ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. హరీశ్​రావు తన నియోజకవర్గానికి వస్తే ఆయనతోనే భూమి పూజ చేయిస్తానని ఆయన అన్నారు. ‘‘గత సర్కార్​ డైట్​ చార్జీలు కూడా పెంచలేదు. స్టూడెంట్ల కోసం  40 శాతం డైట్​ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్​ చార్జీలు పెంచాం. రూ.829 కోట్లు ఫీజు రీయింబర్స్​మెంట్​, ఓవర్సీస్​ స్కాలర్​షిప్​ రూ.167.28 కోట్లు రిలీజ్​ చేశాం. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించాం. పదేండ్లు గత పాలకులు అస్తవ్యస్తం చేసిన వ్యవస్థను మేం స్ట్రీమ్​లైన్​ చేసి ముందుకు వెళ్తున్నాం” అని పేర్కొన్నారు.