బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం .. లెక్కలన్ని తవ్వితీసి ప్రజల ముందు పెడతా: భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం .. లెక్కలన్ని తవ్వితీసి ప్రజల ముందు పెడతా:  భట్టి విక్రమార్క
  • 80 శాతం ఉన్న వర్గాలకు గత ప్రభుత్వం నిధులు ఖర్చుచేయలేదు 
  • రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్​ పెట్టారు
  • అప్రాప్రియేషన్ బిల్లుపై సమాధానం

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖలో జరిగిన అరాచక ఆర్థిక విధ్వంసం మొత్తం తవ్వితీస్తానని, సభలో పెట్టి రాష్ట్ర ప్రజలకు వివరిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడ్జెట్ అప్రాప్రియేషన్ పద్దులపై గురువారం భట్టి సమాధానం ఇచ్చారు. ‘‘నేను యాదృచ్ఛికంగా పొలిటికల్ లీడర్ ను కాలేదు. చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చా. ఫ్యూడల్ వ్యవస్థలో, అనిచివేతలో కూరుకుపోయిన వారిని బయటపడేయాలని వచ్చా. సమసమాజం స్థాపనతోనే అభివృద్ధి. అది చట్టసభల ద్వారానే సాధ్యమని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలు ఆత్మగౌరంతో జీవించడం కోసం పాలిటిక్స్​లోకి వచ్చాను తప్పతే మీలాగా వ్యక్తిగత స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదు. 

వచ్చిన అవకాశాన్ని సమసమాజ స్థాపన కోసం వినియోగిస్తాను. మీలాగా దుర్బుద్ధితో రాజకీయాల్లోకి రాలేదు. బయట చాలా మాట్లాడుతున్నారని వాటిని సభలో ప్రస్తావిస్తున్నరు. మేం మాట్లాడడం మొదలుపెడితే మీ కన్నా ఎక్కువ మాట్లాడగలం. గంజాయి రాజు, లిక్కర్ రాణి అని బయట చాలా మాట్లాడుతున్నారు. సభ్యత కాదని వాటిని మేం సభలో మాట్లాడడం లేదు’’ అని భట్టి మండిపడ్డారు. రూ.3 లక్షల 4 వేల కోట్ల బడ్జెట్​లో రూ.1,44,156 కోట్లు సంక్షేమం కోసం కేటాయించామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే సంక్షేమం కోసం మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని వెల్లడించారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పట్టించుకోలే

రాష్ట్రంలో 86% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి గత పడేండ్ల పాలనలో నిధులు ఖర్చు చేయలేదని భట్టి చెప్పారు. సమాజంలో అత్యధిక శాతం ఉన్న వారి అభివృద్ధిని అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​హయాంలో బడ్జెట్​లో ప్రతిపాదించిన నిధుల్లో రూ.3.21 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. తాజా బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ.50 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని అందుకే బడ్జెట్లో వాటి కోసం రూ.56,084 కోట్లు కేటాయించామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క వ్యవసాయ రంగానికే రూ.62,718కోట్లు ఖర్చుచేశామన్నారు.

పెండింగ్ ​బిల్లులు రూ.12 వేల కోట్లు చెల్లించాం 

గత బీఆర్ఎస్ సర్కారు రూ.40 వేల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టిందని భట్టి తెలిపారు. వీళ్ల హాయంలో సాంక్షన్ వర్స్ రూ. 1,59,940 కోట్లు చేసి చాలా వరకు బిల్లులు ఇవ్వకుండా పోయారన్నారు. రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయారని తెలిపారు. పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ 7, 2023 నుంచి నేటి వరకు రూ.11,892కోట్లు క్లియర్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రూ.25వేల కోట్లు పెండింగ్​లో ఉంటే, ఇప్పటి వరకు రూ.16 వేల కోట్లు క్లియర్​ చేశామని తెలిపారు.

కమిట్​మెంట్​తో కులగణన చేశాం

దేశంలో ఎక్కడా జరగని విధంగా ప్లానింగ్ శాఖ ద్వారా కులగణన చేయించామని భట్టి చెప్పారు. ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుని భవిష్యత్తు ప్రణాళికలు ఏవిధంగా చేయాలనే కమిట్​మెంట్​తో క్యాస్ట్ సర్వే చేశామని తెలిపారు. అత్యంత సున్నితమైన ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని సామరస్యంగా పరిష్కరించామని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కారు పాల్పడిన ఆర్థిక అరాచకత్వంతో తమ ప్రభుత్వంపై తీవ్రమై అప్పుల భారం పడిందన్నారు. పదేళ్ల తర్వాత రీపేంట్ చేసేలా లాంగ్ టర్మ్ అప్పులు తెచ్చారని తెలిపారు. ఇప్పుడు పదేళ్లు పూర్తికాగా లక్షల కోట్లు అప్పుల రీపేమెంట్ భారం తమపై పడుతున్నదన్నారు. 

జూన్​ 2 నుంచి రాజీవ్​ యువ వికాసం

మా ప్రభుత్వం వచ్చాక 57 వేల ఉద్యోగాలు ఇచ్చామని భట్టి చెప్పారు. నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈడబ్ల్యుఎస్​కు న్యాయం చేయాలని బడ్జెట్​లో రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. బ్యాంకు లింకేజీ మరో రూ.3 వేల కోట్లు కలిపి మొత్తం రూ.9 వేల కోట్లతో జూన్ 2 నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని చెప్పారు. వైశ్యులకు కార్పొరేషన్​ పెట్టి రూ.25 కోట్లు, బ్రాహ్మణ పరిషత్తుకు గతంలోని రూ.50 కోట్లుకు అదనంగా రూ.50 కోట్లు కేటాయించామని వివరించారు. 

హరీశ్​ వాస్తవాలు ఒప్పుకోవట్లే

బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు వాస్తవాలు ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదని భట్టి అన్నారు. ఆయన తొండివాదన చేస్తున్నారని.. లెక్కలు అన్ని చెరిపేస్తే చెరిగేవి కాదన్నారు. క్రాప్ లోన్లు అకౌంట్​వారిగా ఎంత వేసామో రాష్ట్రవ్యాప్తంగా ఏ గ్రామంలో ఎంత మాఫీ అయ్యిందో డిస్​ప్లే చేయనున్నట్టు చెప్పారు. 2018లో గజ్వేల్​నియోజకవర్గంలో రూ.143 కోట్లు మాఫీ చేస్తే.. తాము రూ.237 కోట్లు చేశామన్నారు.