- గ్రీన్ పవర్ ప్రాజెక్టుల ప్రోత్సాహానికి సమగ్ర విధానం: డిప్యూటీ సీఎం భట్టి
- సోలార్ రంగంలో పెట్టుబడుల కోసం ఆవిష్కర్తలకు ఆహ్వానం
- దేశాన్ని లీడ్ చేసేలా తెలంగాణను తయారు చేయడమే లక్ష్యం
- గాంధీనగర్లో విద్యుత్తు పెట్టుబడిదారుల సమ్మేళనానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రం గాంధీ నగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో సోమవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నాలుగో ప్రపంచ గ్రీన్ పవర్ పెట్టుబడిదారుల సమ్మేళనం, ఎగ్జిబిషన్ సందర్భంగా నిర్వహించిన సభలో భట్టి ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఉన్న మార్గాలు.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వివరించారు. 2035 నాటికి 500 గిగా వాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని మన దేశం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ విషయంలో దేశాన్ని లీడ్ చేసేలా తెలంగాణను తయారు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. ఐటీ, ఫార్మాస్యుటికల్స్ తయారీ వంటి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలతో ఇది సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌తో రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందన్నారు. కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేయడానికి రీజనల్ రింగ్ రోడ్డు ఉపయోగపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ గ్రీన్ పవర్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తాయన్నారు.
తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు
తెలంగాణలో సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, టీఎస్ ఐపాస్ వంటి వ్యాపార అనుకూల సంస్థలు గ్రీన్ పవర్ రంగాల్లో కంపెనీలు అభివృద్ధి చెందడానికి మంచి అవకాశాలను అందిస్తున్నాయన్నారు. ఇక్కడ 300 రోజులకు పైగా ఉండే సూర్యరశ్మితో సుమారు 26.4 గిగావాట్ల సామర్థ్యం అంచనా వేస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం స్థిరమైన, విశ్వసనీయమైన గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి సమగ్ర గ్రీన్ పవర్ ఎనర్జీ పాలసీని అభివృద్ధి చేస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రం చేపట్టిన గ్రీన్ పవర్ మిషన్ లక్ష్యం సాధించడానికి వివిధ రంగాల్లోని పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలపాలని ఆయన ఆహ్వానించారు.
సోలార్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే వారంతా హైదరాబాద్ కు రావాలన్నారు. సమావేశంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు ముషారఫ్, వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో సమిట్
గ్రీన్ పవర్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న కంపెనీలతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సమిట్ నిర్వహించాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ మేరకు సోమవారం సుమారు 40 కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ జీఐజడ్ ప్రతినిధులతో పాటు, టాటా పవర్, సెంకార్బ్, వెల్ స్పన్, రెన్యూ పవర్, ఇండియన్ ఆయిల్, ఎన్‌హెచ్‌పీసీ , ఐఐటీ బాంబే, ఓఎన్‌వైఎక్స్, హీరో పవర్, ఊర్జా ఎనర్జీ, ఇన్వెస్టర్స్ సమ్మిట్ బ్యాంక్స్, కేజీపీఎం వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఆసక్తి కనబరిచారని భట్టి తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ సంస్థల అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.