- లేటైతే ఖజానాపై భారం పడుతుంది: భట్టి విక్రమార్క
- స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
- ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించం
- యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం రివ్యూ
- పాల్గొన్న మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డి
మిర్యాలగూడ, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఇప్పటికే రెండుసార్లు అంచనా వ్యయం పెరిగిందని, పనుల్లో జాప్యం జరిగితే ప్రభుత్వ ఖజానాపై మరింత భారం పడుతుందని ఆయన అన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి శనివారం భట్టి పరిశీలించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గతంలో ఎంపీలుగా ఉన్న ఉత్తమ్, వెంకట్ రెడ్డికి ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందని, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వారి సహకారం తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రాజెక్టుకు సంబంధించి స్కిల్డ్, అన్ స్కిల్డ్ పనుల్లో స్థానికులకు అవకాశాలు కల్పించాలన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సోలార్, హైడ్రో, విండ్ తదితర గ్రీన్ ఎనర్జీ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, అవి అందుబాటులోకి వచ్చేలోపు యాదాద్రి థర్మల్ పవర్ పనులు పూర్తి కావాలన్నారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం వహించినా, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరించినా సహించేది లేదని హెచ్చరించారు. సెప్టెంబర్ లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని, 2025 మార్చి నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తామని అధికారులు చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బూడిదను ఎప్పటికప్పుడు విక్రయిస్తామని, ఇక్కడ వాడుకునే నీటిని తిరిగి శుద్ధిచేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలపై ఎక్కువ వడ్డీ ఉంటే దాన్ని తగ్గించాలని కోరే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తున్న బొగ్గు గ్రేడ్ వివరాలు, అందుబాటులో ఉన్న క్వార్టర్స్ తదితర అంశాలపై మంత్రులు ఆరా తీశారు. ఉపాధితో పాటు సబ్ కాంట్రాక్టులు, చిన్నచిన్న పనులు కూడా స్థానికులకే ఇవ్వాలని వెంకట్ రెడ్డి సూచించారు. ప్రాజెక్టు పనులపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ రివ్యూలో విద్యుత్ శాఖ సీఎండీ సయ్యద్ అలీ రిజ్వీ, ట్రాన్స్ కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సీఈ సమ్మయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తదితరులు స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ హయాంలో కూలీలుగా మారినం: మహిళా రైతులు
మేళ్లచెరువు, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూలీలుగా మారామని రైతులు మంత్రుల వద్ద వాపోయారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం దొండపాడు వెళ్తూ కిష్టాపురం వద్ద ఆగారు. కారు దిగి మిర్చి పొలంలోకి వెళ్లి అక్కడ ఉన్న మహిళా రైతులు, కూలీలతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పంట పొలాలకు నీళ్లు లేక లిఫ్టులు పని చేయక కూలీలుగా మారామని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన మంత్రి ఉత్తమ్.. అన్ని ఎత్తిపోతల స్కీమ్‌లను ప్రారంభించి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు.