అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు : డిప్యూటీ సీఎం భట్టి

అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు : డిప్యూటీ సీఎం భట్టి
  • 55 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి
  • రూ.11 వేల కోట్లు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి అని వ్యాఖ్య
  • ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి వెంకట్ రెడ్డి
  • పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క బిల్డింగ్ కట్టలే: పొంగులేటి
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 55 నియోజకవర్గాల్లో నిర్మించబోయే గురుకులాల కోసం రూ.11వేల కోట్లు రిలీజ్ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుమారు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్ ఉంటుందన్నారు. ప్రతి స్కూల్​లో అద్భుతమైన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

స్కూల్​లో పని చేసే టీచర్లకు అక్కడే వసతి కల్పించేలా క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నట్లు వివరించారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇన్​చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ భేటీలో కరెంట్ కోతలు, తాగు, సాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాలపై చర్చించారు. సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు.

స్టూడెంట్లకు అన్ని సౌలత్​లు కల్పిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ విద్యా బోధన ఉంటది. ప్రతి స్కూల్​లో ల్యాబ్, ల్రైబరీతో పాటు మినీ థియేటర్ ఉండేలా చూస్తున్నాం. ప్రపంచంతో పోటీపడేలా సిలబస్ ఉంటుంది. మా హయాంలో ఈ స్కూళ్లు నిర్మిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాం. సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. రూ.11 వేల కోట్లు రిలీజ్ చేయడంపై విద్యా శాఖ చూసుకుంటున్న సీఎం రేవంత్​కు ధన్యవాదాలు తెలియజేస్తున్న’’అని భట్టి తెలిపారు.

సాగు, తాగు నీరుఇబ్బంది రానివ్వం: మంత్రి వెంకట్​ రెడ్డి

ఇన్​చార్జ్ మంత్రిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి స్పెషల్ ప్లాన్ డెవలప్ చేస్తామని 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ‘‘వేసవిలో విద్యుత్, తాగు, సాగునీరు సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. యాసంగి పంటలు చేతికొస్తున్న సమయం కావడంతో సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర అభివృద్ధి పనులకు మినరల్ ఫండ్, జిల్లా అభివృద్ధి నిధులు, జిల్లా ఇన్​చార్జ్ మంత్రి నిధులను వినియోగించుకోవాలి. 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. వీటి కోసం రూ.11వేల కోట్లు మంజూరు చేశాం. 

గత బీఆర్ఎస్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లను కోళ్ల ఫామ్స్ మాదిరి నడిపించిన్రు. మేము అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందిస్తున్నాం’’అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అల్వాల్, సనత్ నగర్ టిమ్స్, వచ్చే ఏడాది ఎల్బీ నగర్, వరంగల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేస్తామన్నారు.

బీఆర్ఎస్ అప్పులకువడ్డీలు కడ్తున్నం: మంత్రి పొంగులేటి

10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో గురుకులాలకు సొంత బిల్డింగ్​లు నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘‘విద్యా వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. స్టూడెంట్ల కోసం బిల్డింగ్​లు నిర్మించలేదు కానీ.. వాళ్ల కోసం మాత్రం పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నరు. వాళ్లు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడ్తున్నాం. డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినం. మేము ఆర్భాటంగా పనులు స్టార్ట్ చేయం. 

వచ్చే ఏడాది 4.50 లక్షల ఇండ్లకు ముందే లబ్ధిదారులను ఎంపిక చేస్తాం’’అని పొంగులేటి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీలు రేణుకా చౌదరి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు.