మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • రూ.21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి 
  • మహిళా సంక్షేమాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రభుత్వంలో మహిళల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత పదేండ్ల పాలనలో మహిళల గురించి మాట్లాడుదామంటే అసెంబ్లీలో టైం ఇచ్చేవారు కాదన్నారు. లక్ష కోట్ల అప్పులు తెచ్చి పందికొక్కుల్లా తిన్నారు తప్పితే మహి ళల కోసం ఏమాత్రం ఖర్చు పెట్టలేదని బీఆర్ఎస్​ నేతలపై మండిపడ్డారు. దశాబ్దకాలంలో డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయామని అన్నారు.


 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ పరేడ్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన మహి ళా శక్తి సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. ఇంది రమ్మ రాజ్యం వస్తే తమ ఆశలు నెరవేరుతాయన్న మహిళల ఆకాంక్షలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తున్నదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మహిళలకు రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చామని తెలి పారు.

డ్వాక్రా మహిళలందరూ కలిసి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్​ను  ఉత్పత్తి  చేయబోతున్నారని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా ఆ బస్సులకు వారిని యజమానులను చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని, మహిళా సంఘాలతో 600 బస్సులు కొనుగోలు చేయించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. 

హైటెక్​ సిటీలో డ్వాక్రా బజార్..

మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైదరాబాద్​ నడిబొడ్డున హైటెక్ సిటీలో విలువైన ప్రాంతాన్ని కేటాయించి డ్వాక్రా బజార్ ప్రారంభించామని భట్టి విక్రమార్క చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రభుత్వ బడుల బాధ్యత అప్పగించామని, మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టించామని తెలిపారు.

విద్యార్థుల యూనిఫామ్స కుట్టే పనిని అప్పగించి మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశామని చెప్పారు. కోఠిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టి, విద్యా బోధన వసతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని బీఆర్ఎస్ లాగా గాలి మాటలు చెప్పకుండా.. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్​లో నిధులు కేటాయించి, పనులు ప్రారంభించామని చెప్పారు. పదేండ్లలో దొరల దోపిడీని చూశామని,  ఆ పాలన మళ్లీ రానీయొద్దంటే పేదలు లబ్ధి పొందే ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్సోళ్ల మాటలు పట్టుకుంటే వందేండ్లు వెనక్కి పోతం: సీతక్క

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. నిన్నటిదాకా మహిళలంటే ఒక కుటుంబ బిడ్డనే చూపించినవాళ్లకు.. ఇవాళ మహి ళలు ఫ్రీ బస్సు ఎక్కుతుంటే నచ్చుతలేదని విమర్శించా రు.

మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడాలని గతంలో ఎన్నడూలేని విధంగా ప్రజా ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని 20 రకాల వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటలు పట్టుకుంటే వందేండ్లు వెనక్కి పోతామని, వందేండ్లు మన కుటుంబాలు సుఖంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు దీవించాలని కోరారు.