ఏపీలోకి 7 మండలాల పాపం.. బీఆర్ఎస్, బీజేపీదే : భట్టి విక్రమార్క

ఏపీలోకి 7 మండలాల పాపం.. బీఆర్ఎస్, బీజేపీదే : భట్టి విక్రమార్క
  • వాటికోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్.. పదేండ్లు పట్టించుకోలేదు: డిప్యూటీ సీఎం భట్టి 
  • బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి
  • పెండింగ్ సమస్యలపైనే రేవంత్, చంద్రబాబు భేటీ 
  • రుణమాఫీపై త్వరలోనే జీవో 
  • అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన పాపం బీఆర్ఎస్, బీజేపీదేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావనే లేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్​తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నిర్వాకం వల్లే ఆ ఏడు మండలాలు ఏపీలో విలీనమయ్యాయి. 

వాటిని తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్.. పదేండ్లు పట్టించుకోలేదు. ఇకనైనా ఆ మండలాల కోసం బీఆర్ఎస్ నేతలంతా దీక్షలు చేయాలి’’ అని సూచించారు. గత పదేండ్లలో కేసీఆర్ చేసిన తప్పులే.. ఆయనను వెంటాడుతున్నాయని అన్నారు. ‘‘రాబోయే 15 ఏండ్లు తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ చెప్పేవన్నీ కల్లిబొల్లి కబుర్లే. కారు, సారు, పదహారు అని చెప్పిన వాళ్లు.. సున్నా వచ్చిన విషయం మరచిపోవద్దు” అని అన్నారు.

బుధవారం గాంధీభవన్ లో మీడియాతో భట్టి మాట్లాడారు. పదేండ్లుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ నెల 6న హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారని చెప్పారు. ‘‘చంద్రబాబు, రేవంత్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. వాళ్లు సహచరులే తప్ప.. గురుశిష్యులు కాదు’’ అని తెలిపారు. దీనిపై ఇదివరకే రేవంత్ క్లారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

కేబినెట్ విస్తరణపై హైకమాండ్​దే నిర్ణయం.. 

కేబినెట్ విస్తరణ విషయాన్ని హైకమాండ్​చూసుకుంటుందని, పీసీసీ చీఫ్ విషయంలో ఇంకా కసరత్తు కొనసాగుతున్నదని భట్టి చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. నిరుద్యోగుల విషయంలో హరీశ్​రావు కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇచ్చిన హామీని మా ప్రభుత్వం తప్పకుండా నిలబెట్టుకుంటుంది. దీనిపై త్వరలోనే జీవో విడుదల చేస్తాం. రైతు భరోసా అమలు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. 

త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో దీన్ని చర్చకు పెట్టి, అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే  అమలు చేస్తాం. రైతు భరోసాను నిజమైన రైతులకు ఇవ్వాలనేదే మా అభిమతం. ప్రజల శ్రమతో ప్రభుత్వానికి అందే ప్రతి పైసాను దుబారా చేయకుండా, అవసరమున్న మేరకే ఖర్చు చేయాలన్నది మా ఉద్దేశం. అందుకే రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు చేస్తున్నం” అని వెల్లడించారు. 

తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా ప్రజల మధ్యే తీసుకుంటుందని, నాలుగు గోడల మధ్య నిర్ణయాలు ఉండవన్నారు. కాగా, తన నియోజకవర్గం మధిరలో రైతు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఆత్మహత్యను ప్రేరేపించింది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? అనేది తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించానని తెలిపారు. పూర్తి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. 

ఫిరాయింపులు ఆనాడు కనిపించలేదా? 

పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడు గగ్గోలు పెడుతున్నోళ్లకు, గతంలో అవి కనిపించలేదా? అని భట్టి ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరడాన్ని తప్పుపడుతున్నోళ్లకు.. ఆనాడు ఇదే బీఆర్ఎస్ మా పార్టీ ఎమ్మెల్యేలను గంపగుత్తగా చేర్చుకుని, ప్రతిపక్ష హోదా లేకుండా చేసినప్పుడు కనిపించలేదా?” అని నిలదీశారు. బుధవారం మీడియాతో భట్టి చిట్ చాట్ చేశారు. ‘‘మేం ఎవరినీ కాంగ్రెస్ లోకి రమ్మని బలవంతం చేయడం లేదు. ప్రజాస్వామ్యాన్ని  నిలబెట్టేందుకు, ఓటరు ఇచ్చిన తీర్పును ఐదేండ్ల పాటు కాపాడుకునేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. 

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటుండడంతో వాళ్ల కుట్రలో తాము భాగస్వాములం కాకూడదనే పలువురు బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు’’ అని భట్టి చెప్పారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని తాను పట్టుబడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సోషల్ మీడియా యూనివర్సిటీలో బీఆర్ఎస్ బతుకుతున్నదని, కేసీఆర్ ఊహల్లోంచి బయటకు వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. ‘‘ఇరిగేషన్ లో ఎక్స్‌‌‌‌పర్ట్ అనే ఉద్దేశంతోనే ఏపీలో సీఎస్ గా చేసిన ఆదిత్యనాథ్ దాస్ ను రాష్ట్రానికి సలహాదారుగా పెట్టుకున్నాం. ఆయన మా అంచనాలను అందుకోలేకపోతే పక్కనపెడుతాం. శ్రీనివాస రాజును కూడా అదే ఉద్దేశంతో పెట్టుకున్నాం” అని డిప్యూటీ సీఎం చెప్పారు.

సీఎంల భేటీకి ఏర్పాట్ల పరిశీలన.. 

ఈ నెల 6న ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ హైదరాబాద్​లోని ప్రజా భవన్​లో భేటీ కానున్నారు. పదేండ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ప్రజాభవన్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. వివిధ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు.