- టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టారు
- పనులు ఆలస్యం చేసి రూ.10 వేల కోట్ల అదనపు భారం మోపారు
- బీఆర్‌ఎస్ నేతల అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని మంత్రి వెల్లడి
ఖమ్మం, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్‌లను చేపట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలల వేసి, నివాళి అర్పించారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. బొగ్గు లభించే దగ్గర ప్లాంట్ నిర్మాణం చేయకపోవడంతో.. 350 కిలోమీటర్ల దూరం నుంచి బొగ్గు సరఫరా చేస్తుండటం వల్ల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతుందని తెలిపారు.
2015లో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టినా, పర్యావరణ అనుమతులు రద్దు కావడంతో రూ.25 వేల కోట్ల ప్రాజెక్టు ఖర్చు కాస్తా.. ఇప్పుడు రూ.35 వేల కోట్లకు పెరిగి, అదనంగా రూ.10 వేల కోట్ల అదనపు భారం పెరిగిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి టెండర్లు పిలవకుండా నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టారన్నారు. ‘‘యాదాద్రి పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడంతో 2022 సెప్టెంబర్ 30న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సదరన్ జోన్ చెన్నై అనుమతులను సస్పెండ్ చేసింది.
గత బీఆర్ఎస్ పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ పర్యావరణ అనుమతుల కోసం ఎలాంటి చొరవ చూపలేదు. ఇంపోర్టెడ్ బొగ్గు తీసుకొచ్చి కాలుష్యం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తప్పుడు సమాచారమిచ్చారు. చట్ట ప్రకారం రావాల్సిన విద్యుత్తు తయారు చేసే ఎన్టీపీసీని అప్పటి బీఆర్ఎస్ పాలకులు విస్మరించి, కమీషన్ల కక్కుర్తి కోసం యాదాద్రి, భద్రాది పవర్ ప్రాజెక్టు పనులను మొదలుపెట్టారు”అని భట్టి మండిపడ్డారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ లీడర్లు చేసిన అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామని తెలిపారు.
ప్రజా పాలనపై చర్చకు సిద్ధమా..?
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రజా పాలనపై విమర్శలు చేయడంపై భట్టి ఫైర్ అయ్యారు. సెక్రటేరియెట్‌కు రాకుండా, ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్.. ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, కరెంటు ఇవ్వట్లేదని విమర్శలు చేయడం సరికాదన్నారు. లత్కోర్లు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని కేసీఆర్ తన స్థాయి దిగజారి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ మూడు నెలల ప్రజాపాలనపై, గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వని కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ బిల్లులు ఏటా రూ.10 వేల కోట్ల చెల్లించే దుస్థితికి బీఆర్ఎస్ అవినీతే కారణమని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన అందిస్తుందని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని పార్టీలు కుట్రలు, కుయుక్తులు చేస్తున్నాయని, రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ ప్రేమికులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం మార్చడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నేతలు రాయల నాగేశ్వరరావు, జావేద్ తదితరులు పాల్గొన్నారు.