అన్ని కులాల్లో సర్వే చేస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అన్ని కులాల్లో సర్వే చేస్తున్నం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     భవిష్యత్తులో తెలంగాణను దేశం ఫాలో కావాల్సిందేనని వ్యాఖ్య
  •     కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు: జూపల్లి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని కులాల్లో సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవడానికే కులగణన చేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం గాంధీ భవన్​లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ హామీ మేరకు కులగణన చేస్తున్నామని చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో సమావేశాలు ఉంటాయని తెలిపారు.  మేధావులతోనూ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకెళ్తామని పేర్కొన్నారు. సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్న అందరి సామాజిక,  ఆర్థిక పరిస్థితులు తెలుస్తాయన్నారు. భవిష్యత్తులో తెలంగాణను దేశమంతా ఫాలో కావాల్సిందేనని చెప్పారు. 

వచ్చే నెలాఖరులోపు కులగణన :  జూపల్లి

వచ్చే నెలాఖరులోపు కులగణనను చేపట్టాలని సీఎం రేవంత్ ​రెడ్డి ఆదేశాలు ఇచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్  నేతలు అప్పులకుప్పగా మార్చారని, ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేసిన బీఆర్ఎస్ పార్టీకి అంత ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్​కే లేనన్ని నిధులు బీఆర్ఎస్ పార్టీకి అవినీతి, అక్రమమార్గంలోనే వచ్చాయని ఆరోపించారు.  బుధవారం గాంధీ భవన్​ లో  జూపల్లి మీడియాతో మాట్లాడారు. 

సోనియాగాంధీ,  రాహుల్ గాంధీ, ఖర్గే, తదితర అగ్రనేతలందరూ మాట ఇచ్చినట్టే కుల గణన చేస్తున్నామని,  ఏ సామాజిక వర్గం వారు ఎంత మంది ఉన్నారో నిష్పత్తి  ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.   గత ఎంపీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాతపెట్టారని,  ఆ ఎన్నికల్లో  సున్నా సీట్లు వచ్చినా.. బీఆర్ఎస్​ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదని విమర్శించారు. కేటీఆర్, హరీశ్​ రావు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.  మూసీ పరీవాహక ప్రాంతాల్లో దుర్భర  జీవితం అనుభవిస్తున్నవారు స్వచ్ఛమైన గాలి ఆస్వాదించవద్దా?  అని ప్రశ్నించారు.   తాము 10  నెలల్లో 50 వేలకు పైగా  ఉద్యోగాలు కల్పించామని, బీఆర్ఎస్​  హయాంలో డీఎస్సీ వేశారా? అని నిలదీశారు. 

దేశంలోనే తొలిసారి సమగ్ర కులగణన: పొన్నం

దేశంలోనే తొలిసారి సమగ్ర కుల గణన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని,  వచ్చే నెల 6 నుంచి కుల గణన చేపడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్​ పేర్కొన్నారు.  ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశామని,  సమగ్ర సర్వే సరిగ్గా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.  సీఎం రేవంత్ రెడ్డి సూచన ప్రకారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు  సర్వేలో పాల్గొనే అధికారులకు సహకరించాలని కోరారు.  పార్టీపరంగా కూడా బాధ్యులను నియమిస్తామని,  అధికారులకు ఇబ్బందులు కలగకుండా పార్టీ నేతలు, కార్యకర్తలు సర్వేలో పాల్గొనాలని సూచించారు.