- సంస్థను టాప్ కంపెనీగా నిలబెడ్తం: భట్టి విక్రమార్క
- త్వరలో ప్రత్యామ్నాయ ప్రాజెక్టులకు విస్తరించే యోచనలో సర్కారు
- లిథియం బ్యాటరీ, సోలార్, హైడ్రోజన్ పవర్ ప్రాజెక్టుకు విస్తరణ
- కోల్ బెల్ట్‌లో త్వరలో రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆస్పత్రులు
- సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో డిప్యూటీ సీఎం
- పాల్గొన్న మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, సంస్థను అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ రూ.796 కోట్ల చెక్కులను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి పంపిణీ చేశారు. అనంతరం భట్టి మాట్లాడారు.
కాంట్రాక్టు ఉద్యోగులకూ బోనస్
సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి ప్రాంతం నుంచి ఒక్క గనికూడా ఇతరులకు పోకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఖర్చుల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారని భట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం సంస్థకు 2,412 కోట్ల లాభం వచ్చిందని, అందులో 33శాతం రూ.796 కోట్లను కార్మికులకు బోనస్ గా అందిస్తున్నామని చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఒక్కో కార్మికుడికి రూ.20 వేల ఎక్కువ బోనస్ పడుతుందని తెలిపారు. ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందన్నారు. సింగరేణిలో శాశ్వత ఉద్యోగులు 41,837 మందితో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.
సింగరేణి ఖాళీ జాగలు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు
రాబోయే రోజుల్లో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో పాటు బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్లపై పర్యావరణ హిత ఆంక్షలు ఉండబోతున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడ కోసం ప్రత్యామ్నాయ పవర్ ప్రాజెక్టుల దిశగా సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. లక్ష మంది ఉద్యోగులు ఆధారపడే సింగరేణిని భవిష్యత్ తరాలకు అందించేందుకు అనుగుణంగా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.
లిథియం వంటి ఇతర పరిశ్రమల్లోకి సింగరేణి అడుగు పెట్టబోతోందని, లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, సోలార్, హైడ్రోజన్ పవర్ ప్రాజెక్ట్ కు విస్తరించే చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కొన్ని విదేశీ కంపెనీల భాగస్వామ్యంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉత్పత్తుల పరిశ్రమలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సింగరేణి ఏరియాల్లోని ఖాళీ స్థలాలను గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు భవిష్యత్తులో పెట్టుబడిగా మార్చి దాని నుంచే ఆదాయం సంపాదించేలా ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ స్థలాలే ఇకపై సింగరేణికి నిధులు సమకూర్చే ఆస్తులని తెలిపారు. ఇటీవల తాను విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో కూడా అక్కడి కంపెనీలతో ఈ విషయంపై చర్చించానని, అతి త్వరలో ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయబోతోందని స్పష్టం చేశారు.
దీపావళి బోనస్, దసరా అడ్వాన్స్ కింద 1,261 కోట్లు చెల్లింపు
దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుడికి రూ.93,750 చొప్పున రూ.375 కోట్లను, దసరా పండుగ అడ్వాన్స్ కింద ఒక్కో కార్మికుడికి రూ.25 వేల చొప్పున రూ.90 కోట్లను కలిపి కంపెనీ ఈ ఒక్క నెలలో రూ.1,261 కోట్లను చెల్లిస్తోందని భట్టి తెలిపారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే సింగరేణి చెల్లిస్తుందన్నారు. కార్మికులకు దసరాకు ముందు 11వ తేదీన అన్ని గనుల్లో కంపెనీ ఖర్చుతో విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే సింగరేణివ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రిటైర్డ్ కార్మికులకు వైద్య సేవల పెంపు రిటైర్డ్ కార్మికులకు ప్రస్తుతం అమలవుతున్న సీపీఆర్ఎంఎస్ వైద్య సేవల పరిమితిని రూ.8 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. వాల్ల సొంత ఇండ్లకోసం జాగల కేటాయింపుపై త్వరలోనే చర్చిస్తామని, రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదలపైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డంవినోద్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కాన్ సింగ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, కోరం కనకయ్య, మట్టా రాగమయి, గండ్ర సత్యనారాయణ రావు తదితర సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కనీస వేతనాల అమలు కమిటీ చైర్మన్ బి.జనక్ ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
లాభాల వాటాలో శ్రీనివాస్‌కు 3.24 లక్షల బోనస్
సింగరేణివ్యాప్తంగా అత్యధిక లాభాల వాటా పొందిన కార్మికులు, అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెక్కులు అందజేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్డీఎల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆసం శ్రీనివాస్ 304 రోజులు పని చేయగా రూ.3.24,150 లాభాల వాటాను పొంది సింగరేణి టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కార్మికులు జెస్సిరాజ్ రూ.3.10 లక్షలు, ఎ.శ్రీనివాస్ రూ.3 లక్షలు, ఎం.తిరుపతి రూ.3 లక్షల లాభాల వాటా పొందారు. కాంట్రాక్టు కార్మికులకు ఈ సందర్భంగా రూ.5,000 బోనస్ చెక్కులను పంపిణీ చేశారు.
త్వరలో హైడ్రో పవర్ ప్రాజెక్టులోకి సింగరేణి: మంత్రి పొంగులేటి
సింగరేణి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ తమ ప్రాంతంలో హైదరాబాద్ తరహా అత్యుత్తమ స్థాయి విద్యను అందించే పాఠశాలలు ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసి కార్మికులకే కాకుండా ఇతరులకు విద్య, వైద్య సేవలు అందించాలన్నారు. సింగరేణి వర్టికల్ ఎక్స్పాన్షన్ జరగాలని అనుకుంటున్నామన్నారు. సింగరేణి ప్రాజెక్టు సోలార్‌లో సక్సెస్ అయిందని, త్వరలోనే హైడ్రో పవర్ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
కార్మికులకు బోనస్ కొనసాగిస్తం: మంత్రి శ్రీధర్ బాబు
సింగరేణిలో 1,800 ఉద్యోగ నియామాకాలు చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. సింగరేణిలో ఉద్యోగాల భర్తీ, కారుణ్య నియామకాల్లో కీలక మార్పులు చేపట్టామని వివరించారు. సింగరేణి కార్మికుల కోసం రూ.కోటి బీమా పథకం ప్రారంభించామని చెప్పారు. చెన్నూరు, రామగుండంలో స్కిల్ డెవ్ లప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులను గుర్తించి వారికి బోనస్ ను అందిస్తున్నామని ఇది ఇకపై కొనసాగుతుందన్నారు.
కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచాలి:వివేక్
కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి ఉద్యోగులకు పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, రిటైర్ట్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.