హూవర్ డ్యామ్ అద్భుతం : డిప్యూటీ సీఎం భట్టి

హూవర్ డ్యామ్ అద్భుతం : డిప్యూటీ సీఎం భట్టి
  • అమెరికా టూర్ లో భాగంగా సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి
  • ప్రాజెక్ట్ రక్షణ విధానాలు రాష్ట్రంలో అమలుపై చర్చిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అమెరికాలోని కొలరాడో నదిపై 8 దశాబ్దాల క్రితం నిర్మించిన హైడల్​పవర్​ప్రాజెక్టు హూవర్ డ్యామ్ ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్క్ గ్రావిటీతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్​లో నీటి వినియోగం, రక్షణ చర్యలు తెలంగాణలో ఆచరించదగినవని చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం రాష్ట్ర ప్రతినిధి బృందంలో కలిసి హూవర్ డ్యామ్ ను సందర్శించారు.

అక్కడ జరుగుతున్న జల విద్యుత్తు ఉత్పాదకత, యంత్రాల సామర్థ్యం, నీటి లభ్యత, ప్రాజెక్ట్ రక్షణకు తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. దీన్ని తెలంగాణ హైడల్​పవర్ ప్రాజెక్టుల సమాచారంతో బేరీజు వేశారు. హూవర్ డ్యామ్ ప్లాంట్​ను, పవర్​ జనరేషన్​ను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుకు, రక్షణ మెరుగుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు.

ఈ సందర్భంగా 1931 నుంచి 1935 మధ్య జరిగిన డ్యామ్ నిర్మాణ దృశ్యాలను, ఫొటోలను డ్యామ్ అధికారులు ప్రదర్శించారు. ప్రాజెక్ట్​ వివరాలను రాష్ట్ర బృందానికి వివరించారు. అమెరికాలో కరువు పరిస్థితులు ఏర్పడిన  1931–-36 మధ్య కాలంలో హూవర్ డ్యామ్ నిర్మించినట్లు చెప్పారు. 17 జనరేటర్ల ద్వారా 2080 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందన్నారు. దీంతో మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీరుతాయని అధికారులు వివరించారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతో పాటు సాగునీటి అవసరాలు హూవర్ డ్యామ్ తీరుస్తుందని పేర్కొన్నారు.  

బొగ్గు ఉత్పత్తి విధానం భేష్ 

వర్చువల్ రియాలిటీ సాయంతో బొగ్గును ఉత్పత్తి చేయటం ఒక అద్భుతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం లాస్ వేగాస్ లో జరిగిన మైనెక్స్-2024 అంతర్జాతీయ ప్రదర్శనలో రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి వివిధ ప్రఖ్యాత కంపెనీల స్టాల్స్ ను సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రాన్ని, వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని డిప్యూటీ సీఎం స్వయంగా పరిశీలించారు.

ఈ వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నందున యంత్రాల ఆపరేటర్లు మెరుగైన శిక్షణ పొందేందుకు అవకాశం ఉంటుందని  నిర్వాహకులు తెలిపారు. గనిలో జరిగే పని ప్రదేశానికి యంత్రాన్ని పంపించి అక్కడి పరిస్థితులను వెలుపలు నుంచే అంచనా వేస్తూ బొగ్గును త్రవ్వొచ్చని, ఇది అత్యాధునిక మైనింగ్ పద్ధతిగా నిలుస్తుందని వివరించారు. భట్టి విక్రమార్క మల్లు స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతను హెడ్ గేర్ ధరించి పరిశీలించారు.

ఈ టెక్నాలజీతో  కలిగే ప్రయోజనాలు అద్బుతమని, కార్మికులకు చిన్న ప్రమాదం కూడా జరగకుండా మైనింగ్​ చేయొచ్చన్నారు. సింగరేణి కార్మికుల రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ తరహా టెక్నాలజీని గనుల్లో ఏర్పాటు చేయడానికి అవకాశాలను పరిశీలించాలని సింగరేణి సీఎండీ బలరామ్ ను కోరారు. ఈ ప్రదర్శనలో  ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, స్పెషల్ సెక్రెటరీ  కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.