హైదరాబాద్.. ఫార్మాకు అడ్డా! : భట్టి విక్రమార్క

హైదరాబాద్.. ఫార్మాకు అడ్డా! : భట్టి విక్రమార్క
  • దేశంలో 35% ఉత్పత్తులు ఇక్కడి నుంచే: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • బౌల్ ఆఫ్ ఫార్మాగా నగరం ఎదిగింది
  • రాష్ట్రంలో 10 ఫార్మా జోన్లను ఏర్పాటు చేస్తం: శ్రీధర్​ బాబు
  • ఆరోగ్య సంరక్షణలో సవాళ్లకు ఐటీ, ఏఐలతో పరిష్కారం
  • 73వ ఫార్మా కాంగ్రెస్​లో పాల్గొన్న మంత్రులు

హైదరాబాద్, వెలుగు: దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే వస్తున్నాయని, ఇది రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఏటా రాష్ట్రం నుంచే రూ.50 వేల కోట్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ అంటే బిర్యానీకి ప్రసిద్ధి అని, ఇప్పుడు బయో ఫార్మా, వ్యాక్సిన్లకు హబ్​గా మారిందని చెప్పారు. 

బౌల్ ఆఫ్​ ఫార్మాగా రాష్ట్రం ఎదిగిందని, అనేక ఇన్నోవేషన్లకు కేంద్రంగా మారిందని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన 73వ ఫార్మా కాంగ్రెస్​లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘‘మాది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా 24 గంటలు మా కేబినెట్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలో పరిశ్రమలకు ఎలాంటి సమస్యలూ రానివ్వం. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా క్లస్టర్లను నిర్మించి ప్రోత్సహిస్తం’’ అని హామీ ఇచ్చారు.

త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

రాష్ట్రంలో త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కరెంటు, నీటి సమస్యలు లేవన్నారు. గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యమిస్తున్నామని, మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. ‘‘ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిది. రోగుల భద్రత, ఆరోగ్యాన్ని కాపాడడంలో ఫార్మా రంగానిది కీలకపాత్ర. అత్యంత నాణ్యమైన జనరిక్​ మెడిసిన్​ను ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్న తెలంగాణకు మంచి గుర్తింపు ఉంది. అందరికీ మెరుగైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలం’’ అని ఆయన అన్నారు.

ఫార్మా పరిశ్రమను డీసెంట్రలైజ్ చేస్తం: శ్రీధర్ బాబు

ఫార్మా పరిశ్రమను వికేంద్రీకరించేలా ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐటీ, ఏఐ టెక్నాలజీలు సాయపడుతాయన్నారు. ఫార్మా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. 

పరిశ్రమలకు అవసరమైన రెగ్యులేటరీ సపోర్ట్​ను అందిస్తామని, వాటి అభివృద్ధికి మంచి వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘‘రాష్ట్రంలో ఫార్మా ఔషధాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తం. క్లస్టర్ ఆధారిత అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో 9 లేదా 10 ఫార్మా ఇండస్ట్రీ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నం. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వచ్చే ఐదారేండ్లలో 50 వేల మంది నిపుణులను తయారు చేసే లక్ష్యంతో ప్రత్యేకంగా డిజిటల్, లైఫ్​సైన్సెస్​లో స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతం’’ అని ఆయన చెప్పారు.

రిపోర్టు ఆవిష్కరణ

ఈ సందర్భంగా  ఐపీసీఏ సెక్రెటరీ డాక్టర్​ టి.వి నారాయ‌‌ణ ఒక రిపోర్టును స‌‌మ‌‌ర్పించారు.  ఆరోగ్య ఫలితాలు మెరుగుప‌‌రిచేందుకు.. ప్రపంచ ఫార్మా, హెల్త్ కేర్ రంగాల‌‌ను తీర్చిదిద్దడంలో విద్యార్థులు కీల‌‌కంగా వ్యవ‌‌హ‌‌రిస్తార‌‌ని ఆయ‌‌న చెప్పారు.  గ్లోబల్ ఫార్మాస్యూటికల్ స‌‌ప్లైలో తెలంగాణ 35 శాతం వాటాను క‌‌లిగి ఉంద‌‌ని వెల్లడించారు. ఆరోగ్య సంర‌‌క్షణ‌‌లో ఎదుర‌‌య్యే స‌‌వాళ్లను నూత‌‌న ఆవిష్కర‌‌ణ‌‌ల ద్వారా ప‌‌రిష్కరించేందుకు ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్  దోహ‌‌ద‌‌ప‌‌డుతుందని  పార్థసారథి రెడ్డి  వివరించారు.    డాక్టర్​ కృష్ణా ఎల్లా ( - భార‌‌త్ బ‌‌యోటెక్ చైర్మన్​), డాక్టర్​ మోంటు కుమార్ ప‌‌టేల్ (ప్రెసిడెంట్, - ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా), డాక్టర్​ రాజీవ్ ర‌‌ఘువంశీ (డ్రగ్స్ కంట్రోల్ జ‌‌న‌‌ర‌‌ల్ ఆఫ్ ఇండియా) త‌‌దిత‌‌రులు హాజ‌‌రయ్యారు. 8,500 మంది డెలిగేట్స్​వచ్చారు.

పల్లె దవాఖానాల అభివృద్ధిలో భాగం కండి: కోమటిరెడ్డి  

పల్లె దవాఖాన్ల అభివృద్ధిలో ఫార్మా ఇండస్ట్రీలు భాగం కావాలని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ‘‘20 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాదాపూర్ న్యాక్​లో రివ్యూ చేశాం. అక్కడ 32 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించాం. త్వరలోనే మళ్లీ సమావేశమై నిర్ణయాన్ని ప్రకటిస్తం. 

హైదరాబాద్​లో టిమ్స్, వరంగల్​లో గవర్నమెంట్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ను రూ.8 వేల కోట్లతో నిర్మిస్తున్నం. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో  గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఫార్మా దిగ్గజాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు కేటాయించాలి’’ అని కోరారు. రాష్ట్రంలో రూ.32 వేల కోట్ల ఖర్చుతో రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని, ఇది రాష్ట్ర భవిష్యత్​ను మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ ను కనెక్ట్ చేసేలా నిర్మించనున్న రేడియల్ రోడ్లు.. అద్భుతమైన పారిశ్రామిక కారిడార్లుగా మారుతాయన్నారు.