గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం సాధిస్తం .. ప్రత్యేక పాలసీ ప్రతిపాదిస్తున్నం: భట్టి విక్రమార్క

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం సాధిస్తం .. ప్రత్యేక పాలసీ ప్రతిపాదిస్తున్నం: భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: గ్రీన్ ఎనర్జీకి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో నేషనల్ టార్గెట్ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రతిపాదిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీ సెక్టార్ వేగంగా వృద్ధి చెందుతున్నదని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘గ్రీన్ ఎనర్జీ చాలా రంగాల్లో విస్తరించింది. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2023–24లో 15,623 మెగావాట్లు ఉండగా.. 2027–28లో 20,968 మెగావాట్లకు చేరుకుంటదని అంచనా వేస్తున్నం. 2034–35లో 31,809 మెగావాట్లకు పెరిగే అవకాశాలున్నాయి.

 2023–24లో విద్యుత్ అవసరం 85,644 మిలియన్ యూనిట్లు. 2027–28లో 1,15,347 మిలియన్ యూనిట్లు, 2034–35లో 1,50,040 మిలియన్ యూనిట్లకు పెరుగుతదని అంచనా వేస్తున్నం. 2030 నాటికి రాష్ట్రంలో 20వేల మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. జాతీయ స్థాయిలో నిర్ణయించిన గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించే దిశగా జనవరి 3న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్​లో హైదరాబాద్ భాగస్వాములతో సమావేశం నిర్వహించినం’’అని భట్టి విక్రమార్క తెలిపారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.