సంక్షేమంలో.. తెలంగాణ దేశానికే ఆదర్శం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

సంక్షేమంలో.. తెలంగాణ దేశానికే ఆదర్శం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయి
  • సన్న బియ్యం పంపిణీతో 
  • 3.10 కోట్ల మందికి లబ్ధి
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇన్ని పథకాలు ఎలా అమలు చేస్తున్నారని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంప్‌‌ ఆఫీస్‌‌లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత పాలకులు రూ. 8 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే.. వాటిని సరి చేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

పేదలకు సన్న బియ్యం పంపిణీ తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. రాష్ట్రంలోని 2.85 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, కొత్తగా మంజూరు చేసే కార్డులతో ఈ సంఖ్య 3.10 కోట్లకు చేరుతుందన్నారు. సన్నబియ్యం పంపిణీకి ప్రతి సంవత్సరం రూ. 13,525 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సన్న వడ్లు సాగు చేసే రైతులకు బోనస్‌‌ సైతం ఇస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ. 2,675 కోట్లు వెచ్చిస్తోందన్నారు.

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు ఇచ్చాం, మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అని చెప్పారు. పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమిషన్‌‌ను ప్రక్షాళన చేసి జాబ్‌‌ క్యాలెండర్‌‌ విడుదల చేశామన్నారు. నిరుద్యోగులు సొంతంగా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో రూ. 9 వేల కోట్లతో రాజీవ్‌‌ యువ వికాసం స్కీమ్‌‌ ప్రారంభించినట్లు తెలిపారు.

జూన్‌‌ 2 నుంచి 9 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రాజీవ్‌‌ యువ వికాసం శాంక్షన్‌‌ లెటర్లు ఇస్తామన్నారు. సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్‌‌ నాయక్‌‌, హస్తకళల బోర్డు చైర్మన్‌‌ నాయుడు సత్యం, కాంగ్రెస్‌‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మధిర మండల, పట్టణ అధ్యక్షులు సూరంశెట్టి కిశోర్‌‌, మిర్యాల రమణగుప్త పాల్గొన్నారు